గతంలో టెన్నిస్ మాజీ నంబర్ వన్ ప్లేయర్ ఆమె. కానీ, ఎనిమిదేళ్లుగా ఆడిన ప్రతి టోర్నీలోనూ ప్రారంభ రౌండ్లలోనే నిష్క్రమించింది. ఆ అపవాదును దాటుకుని ప్రస్తుత ఫ్రెంచ్ ఓపెన్‌లో(French Open) నాలుగో రౌండ్‌కు చేరింది. ఆ క్రీడాకారిణే బెలారస్‌కు చెందిన విక్టోరియా అజరెంకా(Victoria Azarenka).
మూడో రౌండ్లో అమెరికా ప్లేయర్ మాడిసన్ కీస్ (Madison Keys)పై 6-2, 6-2 తేడాతో వరుస సెట్లలో గెలిచింది విక్టోరియా. తన తదుపరి మ్యాచ్‌లో రష్యా ప్లేయర్ అనస్తాసియా పావ్యుచెంకోవా (Anastasia Pavlyuchenkova)తో తలపడనుంది.
చివరగా 2013లో సెమీస్ చేరింది విక్టోరియా. వెన్నునొప్పితో గత నెల మాడ్రిడ్ ఓపెన్‌కూ దూరమైంది. కానీ ఇంతలోనే తేరుకుని ఫ్రెంచ్ ఓపెన్‌లో సత్తా చాటుతోంది. ప్రస్తుతం ఈ టోర్నీలో టాప్-3 సీడెడ్ ఆటగాళ్లు దూరమైన నేపథ్యంలో అజరెంకాకు టైటిల్ దక్కించుకనే అవకాశాలూ ఉన్నాయి. మానసిక ఒత్తిడి కారణంగా జపాన్ ప్లేయర్, రెండో సీడ్ నవోమి ఒసాకా(Naomi Osaka) టోర్నీ నుంచి వైదొలగగా, గాయంతో తొలి సీడ్ ప్లేయర్ యాష్ బార్టీ(Ash Barty) ఆటకు దూరమైంది. శుక్రవారం జరిగిన గేమ్‌లో మూడో సీడ్ అరైనా సెబలంక పరాజయంతో ఇంటిముఖం పట్టింది.