కరోనా వైరస్ కారణంగా తమ పరిధిలో ఆగస్టులో జరగాల్సిన అనేక టోర్నీలను అమెరికా టెన్నిస్ సంఘం (యుఎస్‌టీఏ) రద్దు చేసింది. వివిధ జూనియర్ వయో విభాగాల్లో యుఎస్‌టీఏ నేషనల్ ఛాంపియన్‌షిప్స్‌ను నిర్వహించరాదని నిర్ణయించింది. యుఎస్ ఓపెన్‌ను మాత్రం ఇప్పటికీ నిర్వహించాలనే ఆలోచనతోనే ఉంది. షెడ్యూలు ప్రకారం యుఎస్ ఓపెన్ ఆగస్టు 31న ఆరంభం కావాల్సి వుంది.
స్టార్లు దూరం..!
ఈ ఏడాది టోర్నీకి అగ్రశ్రేణి క్రీడాకారులు ఎంతమంది సిద్ధమవుతారన్నదే ప్రశ్న. గాయం కారణంగా ఫెదరర్ ఇప్పటికే ఈ సీజన్ మొత్తానికి దూరమయ్యాడు. ప్రపంచ నం.1 నొవాక్ జకోవిచ్, రఫెల్ నాదల్‌తో పాటు.. మహిళల నం.1 ఆష్ బార్టీ, సిమోనా హలెప్ యుఎస్ ఓపెన్ నిర్వహణపై ఆందోళన వ్యక్తం చేశారు. హలెప్ తాను ఈ టోర్నీ నుంచి వైదొలుగుతున్నట్లు చెప్పింది. సెరెనా విలియమ్స్ మాత్రం ఆడతానని స్పష్టం చేసింది. మరి మిగతా వారిలో ఎంతమంది పోటీపడతారన్నది చూడాలి. యుఎస్ ఓపెన్ ముగిశాక.. ఫ్రెంచ్ ఓపెన్‌ను కూడా నిర్వహించే అవకాశముంది.
75 ఏళ్ల తర్వాత..
ప్రతి ఏడాది గ్రాండ్‌స్లామ్‌లో యూఎస్ ఓపెన్‌ను చివరిగా నిర్వహిస్తారు. అయితే కరోనా ప్రభావంతో ఆగస్టు 31 నుంచి సెప్టెంబరు 13 మధ్య, ప్రేక్షకులు లేకుండానే జరపనున్నారు. ఈ ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్ మాత్రమే జరిగింది. మే నెలలోని ఫ్రెంచ్ ఓపెన్ కరోనా వల్ల వాయిదా పడగా.. వింబుల్డన్ పూర్తిగా రద్దయింది. 1945లో రెండో ప్రపంచయుద్ధం కారణంగా వింబుల్డన్ తొలిసారి రద్దవగా, 75 సంవత్సరాల తర్వాత మళ్లీ ఇప్పుడు అదే పరిస్థితి పునరావృతమైంది.