టాలీవుడ్ హీరో రామ్‌చరణ్ భార్య ఉపాసన, టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా కలసి లండన్‌లో షికారు చేశారు. అక్కడ వీధుల్లో తిరుగుతూ సరదాగా గడిపిన క్షణాలను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసింది ఉపాసన. సానియా మీర్జా కొడుకు ఇజాన్‌తో కలిసి దిగిన ఫొటోలు ప్రస్తుతం నెట్టంట చక్కర్లు కొడుతున్నాయి. వీరిద్దరితో పాటు సానియా మీర్జా చెల్లెలు ఆనంమీర్జా,అజహరుద్దీన్ కొడుకు మొహమ్మద్ అసదుద్దీన్ కూడా ఉన్నాడు. ఆనం, అసదుద్దీన్‌ను త్వరలో రెండో పెళ్లి చేసుకోనున్నట్లు వార్తలు వస్తున్నాయి.
లండన్‌లో సానియా కొడుకుతో ఉపాసన చక్కర్లు - లండన్‌లో సానియా కొడుకుతో ఉపాసన చక్కర్లు
ప్రపంచకప్ మ్యాచ్‌లు చూసేందుకు వెళ్లిన మెగా కోడలు ఉపాసన... స్నేహితురాలైన టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జాను కలిసింది. లండన్ వీధుల్లో విహారిస్తూ అక్కడ షాపింగ్ చేసిన ఫొటోలను అభిమానులతో పంచుకుంది.
క్రికెట్ వరల్డ్‌కప్ ఇంగ్లండ్‌లో జరుగుతున్న విషయం తెలిసిందే. పాకిస్థాన్ జట్టులో సానియా మీర్జా భర్త షోయబ్ మాలిక్ కూడా ఆడుతున్నాడు. కొన్ని రోజులుగా భర్తతో పాటు ఇంగ్లండ్‌లో ఉంటోంది సానియా మీర్జా. లండన్ టూర్లో ఉన్న ఉపాసన భారత్Xపాక్ మ్యాచ్ వీక్షిస్తూ టీమిండియాకు మద్దతిచ్చింది.
భారత్‌తో మ్యాచ్‌లో ఘోర పరాభవం ఎదుర్కొన్న పాక్ జట్టు భారీ విమర్శలు మూటగట్టుకుంది. మ్యాచ్‌కు ముందు ఆటగాళ్లు రెస్టారెంట్లలో గడిపినట్లు కూడా వీడియోలు వెలువడ్డాయి. దానిలో సానియా, షోయబ్ జంట కనిపించడం వల్ల ఈ ఇద్దరి పైనా ఫైర్ అయ్యారు పాకిస్థాన్ అభిమానులు.