టోక్యో 2020తో భారత్ తరఫున నాలుగు ఒలింపిక్స్‌లలో పాల్గొన్న తొలి మహిళా అథ్లెట్‌గా నిలవనుంది సానియా మిర్జా. ఒలింపిక్స్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించడాన్ని అథ్లెట్లందరూ గౌరవంగా భావిస్తారని తెలిపింది.
"మన సామర్థ్యాలపై నమ్మకం ఉంచడం అన్నింటికన్నా ముఖ్యం. నేను 30ల్లో.. ఈ స్థాయిలో ఉన్నా. భవిష్యత్తు గురించి ఎక్కువగా ఆలోచించను. ఇక, భారత్‌కు ప్రాతినిధ్యం వహించడం నాకెంతో ఇష్టం. ముఖ్యంగా ఒలింపిక్స్ లాంటి వేదికల్లో అది గౌరవంగా భావిస్తా."
- సానియా మిర్జా, భారత టెన్నిస్ క్రీడాకారిణి
2018లో ఇజాన్‌కు జన్మనిచ్చాక గతేడాది జనవరిలో హోబర్ట్ ఇంటర్నేషనల్ టైటిల్ గెలిచి సెకండ్ ఇన్నింగ్స్‌ను ఘనంగా ప్రారంభించింది సానియా. ఈ వారమే జరిగిన ఈస్ట్‌బోర్న్ ఇంటర్నేషనల్ ఈవెంట్లో తొలి రౌండ్లోనే సానియా జోడీ నిష్క్రమించింది. ప్రస్తుతం నెల వ్యవధిలో జరగనున్న వింబుల్డన్, ఒలింపిక్స్లపై దృష్టి సారించింది. అందుకోసం తీవ్రంగా శ్రమిస్తున్నట్లు చెప్పింది.
'కోర్టు లోపల, బయట కఠోర సాధన చేస్తున్నా. చురుకుగా, శక్తిమంతంగా ఉండటానికి శ్రమిస్తున్నా. డబుల్స్‌లో అంకితా రైనాతో జతకట్టడం సంతోషంగా ఉంది. టాప్ 100లో ఉన్న భారత క్రీడాకారిణితో ఒలింపిక్స్‌కు వెళ్లడం ఇదే తొలిసారి' అని సానియా తెలిపింది.
ఇదీ చూడండి:'ఆ సమయంలో కారణం లేకుండానే కన్నీళ్లు వచ్చేవి'