నాన్న టాక్సీ డ్రైవర్.. ఆర్థిక ఇబ్బందులు.. దేశం కాని దేశానికి వలస రావడం.. ఇదీ ఆస్ట్రేలియా ఓపెన్ మహిళల సింగిల్స్ విజేత సోఫియా కెనిన్ గాథ.. పుట్టింది రష్యా అయినా కుటుంబం కోసం అమెరికాకు వలస వచ్చింది కెనిన్ కుటుంబం. ఒకవైపు ఆమె తండ్రి అలెక్స్ టాక్సీ నడుపుతూనే తన కూతురు సోఫియాకు టెన్నిస్‌లో శిక్షణ ఇచ్చాడు. విశేషం ఏమిటంటే అలెక్స్‌కు టెన్నిస్‌లో ఓనమాలు తెలియవు. అయినా కూతురు టెన్నిస్ ఛాంపియన్ కావాలనే సంకల్పంతో ఎంతో కష్టపడి ఈ ఆటపై అవగాహన పెంచుకున్నాడు. ఇంగ్లిష్ రాకపోయినా.. కోచ్‌లతో ఎలాగోలా మాట్లాడుతూ వారి నుంచి మెళకువలు తెలుసుకున్నాడు.
నాన్న డ్రైవర్.. కూతురు ఛాంపియన్ - sports news
అమెరికాకు వలస వచ్చినా, భాష తెలియకపోయినా, ఆట రాకపోయినా కష్టపడి నేర్చుకుంది. తన కెరీర్లో తొలిసారి ఆస్ట్రేలియన్ ఓపెన్-2020 ఛాంపియన్‌గా నిలిచింది. డ్రైవర్‌గా పనిచేస్తున్న తండ్రి కలను నెరవేర్చింది. ఇంతకీ ఆమె ఎవరు? కథేంటి?
రాత్రి వేళ టాక్సీ నడుపుతూ.. ఉదయం ఇంగ్లిష్ ట్యూషన్‌కు వెళ్లేవాడు. తాను నేర్చుకున్నవి తన కుమార్తెకు నేర్పించేవాడు. తన చుట్టూ ఉండే క్రీడాకారులు ఎలా ఆడుతున్నారో గమనించి.. సోఫియా తప్పులు దిద్దేవాడు. అందుకే ఆస్ట్రేలియన్ ఓపెన్లో గెలవగానే ఆమె కన్నీళ్లు పెట్టుకుంటూ పరుగెత్తుతూ వెళ్లి ప్రేక్షకుల్లో ఉన్న నాన్నను కౌగిలించుకుంది.
"చిన్నప్పుడు నన్నెవరూ పట్టించుకునేవాళ్లు కాదు. అందుకు కారణం నేను అందరికంటే ఎత్తు తక్కువగా ఉండడమే. కానీ నాన్న నన్ను నమ్మారు. ఏదో ఒకటి సాధించగలనని అనుకున్నారు. అదే ఈరోజు ఆస్ట్రేలియన్ ఓపెన్ రూపంలో నిజమైంది" అని సోఫియా ఉద్వేగంగా చెప్పింది.