తెలంగాణ

telangana

ETV Bharat / sports

French Open: మూడో రౌండ్లో సెరెనా, జ్వెరెవ్ - సిట్సిపాస్ ఫ్రెంచ్ ఓపెన్

ఫ్రెంచ్ ఓపెన్ (French Open) మహిళల విభాగంలో​ మూడో రౌండ్లోకి ప్రవేశించారు సెరెనా విలియమ్స్, విక్టోరియా అజరెంక. పురుషుల విభాగంలో జ్వెరెవ్, సిట్సిపాస్ రెండో రౌండ్​లో విజయం సాధించారు.

serena
సెరెనా

By

Published : Jun 3, 2021, 7:06 AM IST

ఏడో సీడ్‌ సెరెనా విలియమ్స్‌ (Serena Williams-అమెరికా) ఫ్రెంచ్‌ ఓపెన్‌(French Open)లో మూడో రౌండ్‌కు దూసుకెళ్లింది. రెండో రౌండ్లో ఆమె 6-3, 5-7, 6-1తో బుజార్నెస్కూ (రొమేనియా)పై విజయం సాధించింది. మాజీ నంబర్‌వన్‌ విక్టోరియా అజరెంక (Victoria Azarenka-బెలారస్‌) కూడా రెండో రౌండ్‌ను అధిగమించింది. అజరెంక 7-5, 6-4తో టాసన్‌ (డెన్మార్క్‌)ను ఓడించింది. పదో సీడ్‌ బెన్సిచ్‌ (స్విట్జర్లాండ్‌) ఇంటిముఖం పట్టింది. కసాట్కినా (రష్యా) 6-2, 6-2తో ఆమెకు షాకిచ్చింది. వొండ్రుసోవా (చెక్‌), హెర్కాగ్‌ (స్లొవేనియా), సైనికోవా (చెక్‌), మాడిసన్‌ కీస్‌ (అమెరికా), క్రిస్టీ (రొమేనియా) కూడా మూడో రౌండ్‌కు చేరుకున్నారు.

పురుషుల సింగిల్స్‌లో ఆరో సీడ్‌ అలెగ్జాండర్‌ జ్వెరెవ్‌ (Alexander Zverev), అయిదో సీడ్‌ సిట్సిపాస్‌ (Tsitsipas) మూడో రౌండ్లో అడుగుపెట్టారు. గట్టి ప్రతిఘటన ఎదురైన రెండో రౌండ్లో జ్వెరెవ్‌ 7-6 (7-4), 6-3, 7-6 (7-1)తో క్వాలిఫయర్‌ రోమన్‌ సఫియులిన్‌ (రష్యా)పై విజయం సాధించాడు. తొలి రెండు సెట్లు గెలిచిన జ్వెరెవ్‌ (జర్మనీ) మూడో సెట్లో ఓ దశలో 1-4తో వెనుకబడ్డాడు. కానీ బలంగా పుంజుకున్న జ్వెరెవ్‌ టైబ్రేక్‌లో సెట్‌ను గెలుచుకుని మ్యాచ్‌ను ముగించాడు. మ్యాచ్‌లో 15 ఏస్‌లు కొట్టిన జ్వెరెవ్‌.. ఏకంగా 10 డబుల్‌ ఫాల్ట్‌లు చేశాడు.

సిట్సిపాస్‌ (గ్రీస్‌) తేలిగ్గానే ముందంజ వేశాడు. రెండో రౌండ్లో అతడు 6-3, 6-4, 6-3తో పెడ్రో మార్టినెజ్‌ (స్పెయిన్‌)ను ఓడించాడు. మ్యాచ్‌లో సిట్సిపాస్‌ ఎనిమిది ఏస్‌లు సంధించాడు. నిషికోరి (జపాన్‌), ఫోగ్నిని (ఇటలీ), ఇస్నర్‌ (అమెరికా) కూడా మూడో రౌండ్లో ప్రవేశించారు. నిషికోరి 4-6, 6-2, 2-6, 6-4, 6-4తో కచనోవ్‌ (రష్యా)పై నెగ్గగా.. ఫోగ్నిని 7-6 (8-6), 6-1, 6-2తో ఫస్కోవిక్స్‌ (హంగేరి)ను ఓడించాడు. ఇస్నర్‌ 7-6 (8-6), 6-1, 7-6 (7-5)తో క్రజనోవిచ్‌ (సెర్బియా)పై విజయం సాధించాడు.

దివిజ్‌ శరణ్‌ జోడీ ఓటమి

పురుషుల డబుల్స్‌లో దివిజ్‌ శరణ్‌ తొలి రౌండ్‌ దాటలేకపోయాడు. దివిజ్‌, డెల్బోనిస్‌ (అర్జెంటీనా) జంట 6-3, 6-7 (11-13), 4-6తో మినావర్‌-రీడ్‌ (ఆస్ట్రేలియా) ద్వయం చేతిలో ఓడిపోయింది. మహిళల డబుల్స్‌ తొలి రౌండ్లో అంకిత, లారెన్‌ డేవిస్‌ (అమెరికా) జోడీ 4-6, 4-6తో హర్దెకా (చెక్‌), సీగ్మండ్‌ (జర్మనీ) జంట చేతిలో ఓడింది.

ABOUT THE AUTHOR

...view details