తెలంగాణ

telangana

ETV Bharat / sports

24వ టైటిల్ కోసం ఒకరు.. బోణీ​ కోసం మరొకరు - final

వింబుల్డన్ మహిళల సింగిల్స్ ఫైనల్లో నేడు సిమోనా హలెప్​(రొమేనియా)తో తలపడనుంది సెరెనా విలియమ్స్​(అమెరికా). ఈ టైటిల్ నెగ్గి మార్గరేట్ కోర్ట్(24) రికార్డును సమం చేయాలని ఆశపడుతోంది సెరెనా.

సెరేనా - హలెప్

By

Published : Jul 13, 2019, 9:47 AM IST

వింబుల్డన్ మహిళల సింగిల్స్​ ఫైనల్ మ్యాచ్ నేడు జరగనుంది. 8 సార్లు టైటిల్ గ్రహీత సెరెనా విలియమ్స్ తుదిపోరులో రొమేనియా క్రీడాకారిణి సిమోనా హలెప్​తో తలపడనుంది. ఈ రోజు సాయంత్రం 6.30 గంటలకు భారత్​లో ప్రత్యక్ష ప్రసారం కానుంది.

మార్గరెట్​ రికార్డును సమం చేస్తుందా..?

అత్యధిక గ్రాండ్​స్లామ్​లు కొల్లగొట్టిన మార్గరెట్ కోర్ట్​(24) రికార్డుకు అడుగు దూరంలో ఉంది సెరెనా విలియమ్స్​. ఇప్పటికే 23 టైటిళ్లను వశం చేసుకుంది ఈ అమెరికా దిగ్గజం. చివరగా 2017లో ఆస్ట్రేలియా ఓపెన్​లో 23వ గ్రాండ్​స్లామ్​ నెగ్గింది.

ఈ వింబుల్డన్​లో క్వార్టర్స్​ వరకు సులభంగా వచ్చిన సెరెనా.. సెమీస్ చేరేందుకు చెమట చిందించాల్సి వచ్చింది. అమెరికాకే చెందిన అలెసన్ రిస్కే గట్టి పోటీ నిచ్చింది. 6-4, 4-6, 6-3 తేడాతో శ్రమించి సెమీస్​ చేరింది సెరెనా. సెమీస్​లో చెక్​ క్రీడాకారిణి బార్బొరాపై సులభంగా గెలిచింది. ఏకపక్షంగా సాగిన మ్యాచ్​లో 6-1, 6-2 తేడాతో విజయం సాధించింది.

గత రెండు గ్రాండ్​స్లామ్​ టైటిళ్ల​ను చేజార్చుకుంది సెరెనా. 2018 వింబుల్డన్​ కెర్బర్​పై ఓడగా.. అదే ఏడాది యూఎస్ ఓపెన్​లో నొవామి స్కాట్​ చేతిలో పరాజయం చెందింది. ఈ సారి ఫైనల్లో హలెప్​ను ఢీకొట్టనుంది. వీరిద్దరూ ఇప్పటివరకు 10 సార్లు ముఖాముఖి తలపడగా 8 సార్లు సెరెనానే గెలిచింది. ఈ మ్యాచ్​లో విజయం సాధించి కోర్ట్ రికార్డును సమం చేయాలని అనుకుంటోంది ఈ అమెరికా దిగ్గజం.

"నేను 2014 డబ్ల్యూటీఏ ఫైన​ల్లో ఆమెతో(హలెప్) ఓడిపోయాను. అంత త్వరగా ఆ ఓటమిని మర్చిపోలేను. ఆమె చాలా బాగా ఆడింది. వింబుల్డన్​ ఫైనల్లో ఆమె కంటే మంచి ప్రదర్శన చేసి టైటిల్ నెగ్గుతాను" -సెరెనా విలియమ్స్, అమెరికా క్రీడాకారిణి.

తొలి వింబుల్డన్ ఫైనల్ ఆడనున్న హలెప్..

తొలిసారి వింబుల్డన్​లో ఫైనల్​ చేరింది హలెప్​. మొదటి రౌండ్​ నుంచి సులభంగా నెగ్గుకుంటూ వస్తున్న హలెప్​ క్వార్టర్స్​లో కాస్త కష్టపడింది. షూయై జాంగ్​పై(చైనా) తలపడి తొలి సెట్​లో చెమట చిందించి గెలిచింది. రెండో సెట్లో సత్తా చాటింది హలెప్​. సెమీస్​లో ఏక పక్షంగా సాగిన మ్యాచ్​లో ఉక్రెయిన్ క్రీడాకారిణి ఎలినాపై 6-1, 6-3 తేడాతో నెగ్గింది.

గత ఏడాది ఫ్రెంచ్ ఓపెన్​ను నెగ్గి తొలి టైటిల్​ను తన ఖాతాలో వేసుకుంది హలెప్​. డబ్ల్యూటీఏలో 17 సార్లు​ రన్నరప్​గా నిలిచిన హలెప్ వింబుల్డన్​పై కన్నేసింది. అయితే రికార్డుల ప్రకారం సెరెనా విలియమ్స్ ముందున్న నేపథ్యంలో ఇవేమి పట్టించుకోవట్లేదని తెలిపింది. ప్రస్తుతం ఆటపైనే దృష్టి పెట్టానంటోంది ఈ మాజీ నెంబర్ వన్.

"ఆమెను(సెరెనా) కట్టడి చేయడం కంటే వింబుల్డన్​లో నేను గెలిచేందుకే చూస్తున్నా. ప్రస్తుతం నా ఆటపైనే దృష్టి పెట్టాను. " -సిమోనా హలెప్​, రొమేనియా క్రిడాకారిణి

24వ టైటిల్ కోసం ఎదురుచూస్తున్న సెరెనా, తొలిసారి ఫైనల్​ ఆడుతున్న హలెప్​ వింబుల్డన్​పై కన్నేశారు. వీరిద్దరిలో గెలుపెవరిదో కొన్ని గంటల్లో తేలనుంది.

ఇది చదవండి: వింబుల్డన్​​​: పురుషుల ఫైనల్లో ఫెదరర్​ X జకోవిచ్​

ABOUT THE AUTHOR

...view details