గర్భం దాల్చిన కారణంగా 23 కిలోల బరువు పెరిగిన భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా.. మగబిడ్డకు జన్మనిచ్చిన తర్వాత కేవలం 4 నెలల్లోనే 26 కిలోలు తగ్గి ఆశ్చర్యపరిచింది. తిరిగి టెన్నిస్ బాట పట్టిన ఆమె వచ్చే ఏడాది ఒలింపిక్స్‌కు సన్నద్ధమవుతోంది. బరువు తగ్గడానికి కారణం తనకున్న వెనకడుగు వేయని వ్యక్తిత్వమేనని అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ప్రత్యేక ఆన్‌లైన్ కార్యక్రమంలో వెల్లడించింది.
నా వల్ల కాదంటే అది చేసి చూపిస్తా: సానియా
మగబిడ్డకు జన్మనిచ్చిన నాలుగు నెలల కాలంలోనే ఏకంగా 26 కిలోల బరువు తగ్గి అందర్నీ ఆశ్చర్యపరిచింది టెన్నిస్ స్టార్ సానియా మీర్జా. అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ప్రత్యేక ఆన్‌లైన్ సెషన్లో మాట్లాడుతూ పలు విషయాలు పంచుకుంది.
బరువు తగ్గడానికి తాను చేసిన కసరత్తులను వీడియోలో వివరించిన ఆమె అందులో మాట్లాడుతూ.. ‘"ఏదైనా సరే అది నా వల్ల కాదు అని నన్ను ఎవరైనా అంటే నేను ఒప్పుకోను. అది చేసి చూపిస్తా. వెనకడుగు వేయని తత్వం నాది. టెన్నిస్‌పై నాకున్న ప్రేమ వ్యాయామం చేసే దిశగా నడిపించింది. ఈ ప్రపంచంలో ఇంకెవరూ చేయనిది నేను చేయాలనుకున్నా. మానసిక బలాన్ని నమ్ముకున్నా. ఇష్టమైన వాటిని తినకుండా నిగ్రహించుకున్నా. రోజుకు కనీసం అర్ధగంట వ్యాయామం చేయడం ముఖ్యం. ప్రసవానంతర కుంగుబాటుకు లోనుకాకుండా కసరత్తులు మేలు చేశాయి. రియో (2016) ఒలింపిక్స్‌లో ఓటమి నా జీవితంలోని తీవ్ర బాధాకరమైన సంఘటనల్లో ఒకటి. మరో ఒలింపిక్స్ ఆడతానని ఆ తర్వాత అనుకోలేదు. కానీ తిరిగి ఆటలో అడుగుపెట్టినపుడు వచ్చే ఒలింపిక్స్‌లో ఆడి పతకం గెలవాలనుకున్నా" అని ఆమె పేర్కొంది.