టెన్నిస్ స్టార్ సానియా మీర్జా వచ్చే ఏడాది టెన్నిస్‌లో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించనుంది. ఈ మేరకు ఇన్‌స్టా వేదికగా గురవారం ఓ పోస్టు పెట్టింది. రెండేళ్ల విరామం తర్వాత హోబర్ట్ అంతర్జాతీయ టోర్నమెంట్ ఆడనున్నట్లు స్పష్టం చేసింది.
" త్వరలో హోబర్ట్ టోర్నీలో ఆడనున్నాను. ఆ తర్వాత ఆస్ట్రేలియా ఓపెన్‌లోనూ బరిలోకి దిగుతాను. వచ్చే నెల ముంబయిలో జరగనున్న ఐటీఎఫ్ మహిళా ఈవెంట్లోనూ పాల్గొంటాను. అయితే ప్రస్తుతానికి టైటిల్ నెగ్గేందుకు పూర్తిస్థాయిలో సన్నద్ధంగా లేను. నా ప్రదర్శన ఎలా ఉందో చూసుకోవాలని అనుకుంటున్నాను. వచ్చే ఏడాది టోర్నీల్లో ఎలాంటి ఫలితం వస్తుందో చూడాలి".
--సానియా మీర్జా, టెన్నిస్ క్రీడాకారిణి
ఆస్ట్రేలియా ఓపెన్‌లో మిక్స్డ్ విభాగంలో అమెరికా క్రీడాకారుడు రాజీవ్ రామ్‌తో కలిసి బరిలోకి దిగుతోంది సానియా. ముఖ్యంగా వచ్చే ఏడాది జరగనున్న టోక్యో ఒలింపిక్స్‌పైనే ఎక్కువ దృష్టి పెడుతున్నట్లు చెప్పుకొచ్చింది.
సానియా- పాకిస్థాన్‌కు చెందిన క్రికెటర్ షోయబ్ మాలిక్ దంపతులకు గతేడాది అక్టోబర్‌లో మగబిడ్డ పుట్టాడు. ఆ బాబుకు ఇజాన్ అనే పేరు పెట్టారు. బిడ్డ పుట్టాక భారీగా బరువు పెరిగిందీ స్టార్ ప్లేయర్. అయితే మళ్లీ రాకెట్ పట్టాలన్న ఆలోచనతో నాలుగు నెలలుగా కఠోరంగా శ్రమిస్తోంది. ఇప్పటికే దాదాపు 26 కిలోల బరువు తగ్గినట్లు చెప్పుకొచ్చింది. జిమ్‌లో కష్టపడిన వీడియోలనూ షేర్ చేసింది.
బాబు ఇజాన్‌తో సానియా మీర్జా 2017 అక్టోబర్‌లో జరిగిన చైనా ఓపెన్‌లో ఉక్రెయిన్‌కు చెందిన క్రీడాకారిణి నదియా కిచోనోక్‌తో కలిసి డబుల్స్ విభాగంలో బరిలోకి దిగిందీ అమ్మడు. ఇప్పటివరకు కెరీర్లో 6 గ్రాండ్‌స్లామ్ టైటిళ్లు గెలిచింది సానియా మీర్జా.