తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఛాంపియన్‌ ఇంటికి.. నాదల్‌ దూకుడు - ఇగా స్వైటెక్‌ ఫ్రెంచ్‌ ఓపెన్‌ 2021

గ్రీస్‌ భామ మారియా సకారి మాయ చేసింది. ఫ్రెంచ్‌ ఓపెన్‌ మహిళల సింగిల్స్‌లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ స్వైటెక్‌కు షాకిచ్చి.. సెమీస్‌లో అడుగుపెట్టింది. ఓ గ్రాండ్‌స్లామ్‌లో ఆ ఘనత సాధించిన తొలి గ్రీకు అమ్మాయిగా చరిత్ర సృష్టించింది. మరోవైపు అమెరికా టీనేజీ సంచలనం గాఫ్‌ జోరుకు క్వార్టర్స్‌లో కళ్లెం వేసిన క్రెజికోవా మొదటిసారి ఓ గ్రాండ్‌స్లామ్‌ సెమీస్‌ చేరింది. పురుషుల సింగిల్స్‌లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ నాదల్‌ దూకుడు కొనసాగుతోంది. అతను తుది నాలుగులో చేరాడు. ప్రపంచ రెండో ర్యాంకర్‌ మెద్వెదెవ్‌ పోరాటం క్వార్టర్స్‌లోనే ముగిసింది.

french open 2021
ఫ్రెంచ్‌ ఓపెన్‌ 2021

By

Published : Jun 10, 2021, 6:45 AM IST

ఫ్రెంచ్‌ ఓపెన్‌ మహిళల సింగిల్స్‌లో వరుసగా రెండు సార్లు విజేతగా నిలిచి.. గత పదమూడేళ్లుగా ఎవరికీ సాధ్యం కాని ఘనతను సొంతం చేసుకుందామని ఆశ పడ్డ ఇగా స్వైటెక్‌ (పోలెండ్‌)కు నిరాశే ఎదురైంది. ఈ డిఫెండింగ్‌ ఛాంపియన్‌ క్వార్టర్స్‌ గడప దాటలేకపోయింది. టైటిల్‌ దారిలో సాగుతున్న 25 ఏళ్ల సకారి ముందు ఆమె నిలవలేకపోయింది. బుధవారం క్వార్టర్స్‌లో 17వ సీడ్‌ సకారి 6-4, 6-4 తేడాతో 8వ సీడ్‌ స్వైటెక్‌ను వరుస సెట్లలో చిత్తుచేసింది. తొలి సెట్‌ ఆరంభంలో మాత్రం 20 ఏళ్ల స్వైటెక్‌దే ఆధిపత్యం. పాయింట్ల వేటలో దూసుకెళ్లిన ఆమె 2-0 ఆధిక్యంతో జోరు ప్రదర్శించింది. కానీ ఆ వెంటనే ప్రత్యర్థి సర్వీస్‌ను బ్రేక్‌ చేసిన సకారి తెలివిగా ఆడింది. నెట్‌ దగ్గర నెమ్మదిగా ఆడుతూ వరుసగా రెండు గేమ్‌లు గెలిచి స్కోరు సమం చేసింది.

సకారి

ఇక అక్కడి నుంచి ఇద్దరూ హోరాహోరీగా తలపడ్డారు. బలమైన సర్వీసులు, శక్తిమంతమైన షాట్లతో పాయింట్ల కోసం పోటీపడ్డారు. దీంతో స్కోరు 4-4తో సమమైంది. ఆ కీలక దశలో ప్రత్యర్థిని తప్పిదాలు చేసేలా ప్రేరేపించి.. పాయింట్లు గెలుచుకున్న సకారి వరుసగా రెండు గేమ్‌లు గెలిచి సెట్‌ సొంతం చేసుకుంది. ఇక రెండో సెట్‌ ప్రారంభం నుంచే ఆమె చెలరేగింది. స్వైటెక్‌ బ్యాక్‌హ్యాండ్‌ షాట్లకు తనదైన శైలిలో సమాధానమిస్తూ గేమ్‌లు గెలిచింది. మధ్యలో కుడి తొడ నొప్పి కారణంగా విరామం తీసుకున్న స్వైటెక్‌.. పట్టీ వేసుకుని ఆట కొనసాగించింది. ఓ దశలో వరుసగా రెండు గేమ్‌లు గెలిచి ప్రత్యర్థిని 4-5తో సమీపించిన స్వైటెక్‌.. పోరాడేలా కనిపించింది. కానీ ఆమె ఆ తర్వాతి గేమ్‌ పాయింట్‌లో లైన్‌ బయటకు బంతి కొట్టడంతో విజయం సకారి సొంతమైంది. ఈ పోరులో 5 ఏస్‌లు సంధించిన సకారి.. 26 విన్నర్లు కొట్టింది.

స్వైటెక్‌

తడబడి.. నిలబడి: 17 ఏళ్ల గాఫ్‌తో క్వార్టర్స్‌ పోరులో మొదట తడబడి.. ఆ తర్వాత గొప్ప పోరాటంతో నిలబడ్డ క్రెజికోవా (చెక్‌ రిపబ్లిక్‌) సెమీస్‌ గడప తొక్కింది. టోర్నీ ఆరంభం నుంచి అనూహ్య ప్రదర్శనతో సత్తాచాటుతున్న ఈ 25 ఏళ్ల అన్‌సీడెడ్‌ క్రీడాకారిణి క్వార్టర్స్‌లో 7-6 (8-6), 6-3తో గాఫ్‌ను ఓడించింది. పవర్‌ గేమ్‌తో చెలరేగిన గాఫ్‌.. తొలి సెట్లో ఓ దశలో 3-0తో నిలిచింది. అయితే నాలుగో గేమ్‌లో ఆమె ఓ డబుల్‌ ఫాల్ట్‌ చేయడంతో అవకాశం అందుకున్న క్రెజికోవా వరుసగా మూడు గేమ్‌లు గెలిచి స్కోరు సమం చేసింది. ప్రత్యర్థిని తికమక పెడుతూ.. అంచనాలకు అందకుండా బంతిని కోర్టుకు ఇరువైపులా పంపిస్తూ ఆమె పాయింట్లు రాబట్టింది. కానీ తిరిగి పుంజుకున్న గాఫ్‌ వరుసగా రెండు గేమ్‌లు గెలిచి 5-3తో దూసుకెళ్లింది. తొమ్మిదో గేమ్‌లో సెట్‌ పాయింట్‌కు ముందు మరో డబుల్‌ ఫాల్ట్‌ చేయడం ఆమె అవకాశాలను దెబ్బతీసింది. అక్కడి నుంచి మరోస్థాయిలో రెచ్చిపోయిన క్రెజికోవా సెట్‌ను టైబ్రేకర్‌కు మళ్లించింది. అక్కడ దూకుడు ప్రదర్శించి విజయాన్ని అందుకుంది. ఇక రెండో సెట్లో ఆమెకు ఎదురు లేకుండా పోయింది. వరుసగా అయిదు గేమ్‌లు నెగ్గిన తను గెలుపు ఖాయం చేసుకుంది.

మహిళల సెమీస్‌లో..
క్రెజికోవా × సకారి
పవ్లిచెంకోవా × జిదాన్‌సెక్‌


సిట్సిపాస్‌ రెండోసారి:పురుషుల సింగిల్స్‌లో అయిదో సీడ్‌ సిట్సిపాస్‌ (గ్రీస్‌) వరుసగా రెండో ఏడాది ఫ్రెంచ్‌ ఓపెన్‌ సెమీస్‌ చేరాడు. క్వార్టర్స్‌లో అతను 6-3, 7-6 (7-3), 7-5 తేడాతో రెండో సీడ్‌ మెద్వెదెవ్‌ (రష్యా)పై గెలిచాడు. ఈ పోరు చివర్లో మ్యాచ్‌ పాయింట్‌ అప్పుడు మెద్వెదెవ్‌ అండర్‌ఆర్మ్‌ సర్వీస్‌ చేసినా ప్రయోజనం లేకపోయింది. సెమీస్‌లో జ్వెరెవ్‌తో సిట్సిపాస్‌ తలపడనున్నాడు.

ఆగని జోరు

నాదల్

14వ ఫ్రెంచ్‌ ఓపెన్‌ టైటిల్‌పై కన్నేసిన మూడో సీడ్‌ నాదల్‌ (స్పెయిన్‌) ఆ దిశగా మరో అడుగు వేశాడు. క్వార్టర్స్‌లో అతను 6-3, 4-6, 6-4, 6-0తో పదో సీడ్‌ ష్వార్జ్‌మన్‌ (అర్జెంటీనా)ను ఓడించి సెమీస్‌ చేరాడు. తనకు తిరుగులేని ఎర్రమట్టి కోర్టులో మరోసారి ఆధిపత్యం ప్రదర్శించిన నాదల్‌ ప్రత్యర్థిపై పైచేయి సాధించాడు. తొలి సెట్‌ ఆరంభంలో పోరు హోరాహోరీగానే సాగింది. బలమైన ప్రత్యర్థి నాదల్‌తో పోరులో ష్వార్జ్‌మన్‌ ప్రతిఘటించాడు. కానీ ఏడో గేమ్‌ వరకూ పోటాపోటీగా సాగిన సెట్‌ను ఆ తర్వాత నాదల్‌ తన చేతుల్లోకి తీసుకున్నాడు. వరుసగా రెండు గేమ్‌లు గెలిచి సెట్‌ సొంతం చేసుకున్నాడు. కానీ రెండో సెట్లో అతనికి కళ్లెం పడింది. అనూహ్యంగా ష్వార్జ్‌మన్‌ వరుసగా మూడు గేమ్‌లు గెలిచి దూసుకెళ్లాడు. నాదల్‌ తిరిగి పుంజుకున్నప్పటికీ అప్పటికే ఆలస్యమైపోవడంతో సెట్‌ చేజారింది. ఇక మూడో సెట్లో పోరు మరోస్థాయికి చేరింది. స్కోరు సమమవుతూ సాగడంతో టైబ్రేకర్‌ తప్పదేమో అనిపించింది. కానీ తొమ్మిదో గేమ్‌లో ప్రత్యర్థి సర్వీస్‌ను బ్రేక్‌ చేసిన నాదల్‌ వరుసగా రెండు గేమ్‌లు నెగ్గి మూడో సెట్‌ దక్కించుకున్నాడు. నాలుగో సెట్లో పూర్తి ఆధిపత్యం ప్రదర్శించిన నాదల్‌.. ప్రత్యర్థికి ఒక్క గేమ్‌ కూడా కోల్పోకుండా సెట్‌ సొంతం చేసుకుని పోరు ముగించాడు.

ఇదీ చూడండి:Nadal: నాదల్​కు మళ్లీ పెళ్లయిందా.. అభిమానులు తికమక!

ABOUT THE AUTHOR

...view details