తెలంగాణ

telangana

ETV Bharat / sports

Wimbledon: ఫెదరర్‌ ఔట్‌.. సెమీఫైనల్​కు ఆ కుర్రాడు - ఫెదరర్‌

వింబుల్డన్‌ నుంచి స్టార్​ టెన్నిస్​ ఆటగాడు ఫెదరర్‌ నిష్క్రమించాడు. ఎనిమిదిసార్లు ఛాంపియన్‌గా నిలిచిన ఫెదరర్​కు.. షాకిస్తూ పోలెండ్‌ కుర్రాడు హర్కజ్‌ సెమీఫైనల్‌కు దూసుకెళ్లాడు. మరోవైపు తన సూపర్‌ ఫామ్‌ను కొనసాగిస్తూ డిఫెండింగ్‌ ఛాంపియన్‌ జకోవిచ్‌ తుది నాలుగులో చోటు దక్కించుకున్నాడు. యువ ఆటగాడు షపొవలోవ్‌ కూడా క్వార్టర్‌ఫైనల్‌ను అధిగమించి సెమీస్​లో అడుగుపెట్టాడు.

Roger Federer
ఫెదరర్‌

By

Published : Jul 8, 2021, 6:51 AM IST

ఫెదరర్‌ తొలి వింబుల్డన్‌ గెలిచినప్పుడు అతడికి ఆరేళ్లు. స్విస్‌ స్టార్‌ అంటే అతడికి ఆరాధన భావం. కానీ బుధవారం అతడు ఫెదరర్‌నే ఓడించి వింబుల్డన్‌ సెమీఫైనల్‌కు దూసుకెళ్లాడు. ఆ కుర్రాడు హ్యూబర్ట్‌ హర్కజ్‌. పోలెండ్‌కు చెందిన 14వ సీడ్‌ హర్కజ్‌ క్వార్టర్‌ఫైనల్లో 6-3, 7-6 (7-4), 6-0తో ఫెదరర్‌పై గెలిచి తొలిసారి ఓ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీ సెమీస్‌లో చోటు సంపాదించాడు. 39 ఏళ్ల ఫెదరర్‌ తొలి సెట్‌ కోల్పోయాక పుంజుకుని రెండో సెట్‌ను టైబ్రేక్‌ వరకు తీసుకెళ్లాడు కానీ.. మూడో సెట్లో పూర్తిగా తేలిపోయాడు. మూడో సెట్లో హర్కజ్‌ అతణ్ని ఒక్క గేమ్‌ కూడా గెలవనివ్వలేదు. వింబుల్డన్‌లో ఓ సెట్‌ను 0-6తో ఓడిపోవడం ఫెదరర్‌కు ఇదే తొలిసారి. బెరెటిని, అలియాసిమె మధ్య క్వార్టర్స్‌ విజేతతో అతడు సెమీస్‌లో తలపడతాడు.

మరోవైపు 20వ గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌తో ఫెదరర్‌, నాదల్‌ల రికార్డును సమం చేయాలనుకుంటున్న ప్రపంచ నంబర్‌వన్‌ జకోవిచ్‌ కూడా సెమీఫైనల్‌కు చేరుకున్నాడు. టాప్‌ సీడ్‌ జకోవిచ్‌ (సెర్బియా) క్వార్టర్‌ఫైనల్లో 6-3, 6-4, 6-4తో హంగేరికి చెందిన మర్తోన్‌ ఫుక్సోవిచ్‌పై విజయం సాధించాడు. ఫామ్‌లో ఉన్న అతడు తొలి సెట్లో 5-0తో ఆధిక్యంలోకి దూసుకెళ్లాడు. అలవోకగా ఆ సెట్‌ను గెలుచుకున్న జకోవిచ్‌.. ఆ తర్వాత కూడా జోరు కొనసాగించాడు. తర్వాతి రెండు సెట్లలోనూ అతడికి ప్రత్యర్థి నుంచి పెద్దగా ఇబ్బంది ఎదురు కాలేదు. 34 ఏళ్ల జకోవిచ్‌కు ఇది పదో వింబుల్డన్‌ సెమీఫైనల్‌. ఫైనల్లో స్థానం కోసం అతడు కెనడాకు చెందిన 22 ఏళ్ల షపొవలోవ్‌ను ఢీకొంటాడు. పదో సీడ్‌ షపొవలోవ్‌ అయిదు సెట్ల పాటు హోరాహోరీగా సాగిన క్వార్టర్‌ఫైనల్లో 6-4, 3-6, 5-7, 6-1, 6-4తో కచనోవ్‌ (రష్యా)ను ఓడించాడు.

సానియా-బోపన్న నిష్క్రమణ: మిక్స్‌డ్‌ డబుల్స్‌లో సానియా మీర్జా, రోహన్‌ బోపన్న పోరాటం ముగిసింది. మూడో రౌండ్లో ఈ జంట 3-6, 6-3, 9-11తో జీన్‌ జులియన్‌ రోజర్‌ (నెదర్లాండ్స్‌), ఆండ్రియా క్లెపాచ్‌ (స్లొవేనియా) జోడీ చేతిలో ఓడిపోయింది.

ఇదీ చదవండి:wimbledon: సెమీస్​కు జకోవిచ్​.. ఫెదరర్​, మీర్జా-బోపన్న ఇంటికి

ABOUT THE AUTHOR

...view details