తెలంగాణ

telangana

By

Published : Mar 25, 2021, 6:34 AM IST

ETV Bharat / sports

టెన్నిస్​లో రాణిస్తున్న రష్మిక.. గ్రాండ్​స్లామే లక్ష్యం

టెన్నిస్​లో అదరగొడుతున్న తెలుగమ్మాయి రష్మిక భమిడిపాటి.. ఇటీవల జరిగిన పోటీల్లో జాతీయ హార్డ్ కోర్ట్ టైటిల్ సొంతం చేసుకుంది. గ్రాండ్​స్లామే తన లక్ష్యమంటూ ఆటలో దూసుకెళ్తోంది.

Rashmika Bhamidipaty emerge victorious at Tennis Hard Court Championships
టెన్నిస్​లో రాణిస్తున్న రష్మిక.. గ్రాండ్​స్లామే లక్ష్యం

పదేళ్లు వెనక్కి వెళ్తే.. తొమ్మిదేళ్ల వయసున్న తమ కూతురికి సంగీతం, టెన్నిస్​లో శిక్షణ అందిస్తున్నారు ఆ తల్లిదండ్రులు. అయితే రెండిట్లో సాధన అంటే కష్టమని భావించి.. ఏదో ఒకటి ఎంచుకోమని ఆ అమ్మాయిని అడి గారు. రంగురంగుల సాక్సులు, బూట్లు వేసుకుని కోర్టులో ఆడుకోవచ్చని అనుకున్న ఆ చిన్నారి అప్పుడు టెన్నిస్ రాకెట్​ను పట్టుకుంది. ఏదో సరదా కోసమే కోర్టులో అడుగుపెట్టిన ఆ బాలిక ప్రయాణం.. ఇప్పుడు సీనియర్ జాతీయ ఛాంపియన్​గా నిలిచేవరకూ వచ్చింది. బుడి బుడి అడుగులతో కోర్టులో కదిలిన ఆ కాళ్లు.. ఇప్పుడు చిరుత వేగంతో పరుగులు పెడుతున్నాయి. వరుస విజయాలతో రాకెట్​లా దూసుకెళ్తోన్న ఆమె.. తెలంగాణ యువ సంచలనం భమిడిపాటి శ్రీవల్లి రష్మిక. ఇటీవల జాతీయ సీనియర్ హార్డ్ కోర్ట్ చాంపియన్ షిప్​లో విజేతగా నిలిచిన ఈ 19 ఏళ్ల అమ్మాయి 'ఈనాడు'తో మాట్లాడుతూ ఆ టోర్నీ విశేషాలు సహా మరెన్నో విషయాలను పంచుకుంది.

ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుని.. అకుంఠిత దీక్ష అంతులేని శ్రమ, అచంచల ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే ఆ మార్గంలో వచ్చే సవాళ్లను, అడ్డంకులను దాటి విజయ తీరాలకు చేరొచ్చని రష్మిక నిరూపిస్తోంది. అందుకు చిన్నతనంలో ఏదో సరదా కోసం రాకెట్ పట్టినా, ఇప్పుడు జాతీయ సీనియర్ ఛాంపియన్​గా నిలిచిన తన ప్రయాణమే నిదర్శనం. అందరూ కలలు కంటారని.. కానీ కష్టపడ్డ వాళ్లే వాటిని నిజం చేసుకుంటారని ఆమె రుజువు చేస్తోంది. ఆడపిల్లకు ఆటలెందుకని ఇప్పటికీ ప్రశ్నించే ఈ సమాజంలో తమ కుమార్తెను మాత్రం టెన్నిస్ ఛాంపియన్‌గా చూడాలనే తల్లిదండ్రుల ఆశలకు ప్రాణం పోస్తూ ఆమె సాగుతోంది. ఇప్పటికే జూనియర్ క్లే కోర్టు, హార్డ్ కోర్ట్ జాతీయ ఛాంపియన్​గా నిలిచిన తను.. ఇప్పుడు హార్డ్ కోర్ట్ ఛాంపియన్‌షిప్​లో టైటిల్​తో తనపై అంచనాలను మరింత పెంచేసింది. బలమైన ఫోర్ హ్యాండ్ షాట్లు, వేగవంతమైన సర్వీస్​లతో ప్రత్యర్థులను చిత్తు చేసింది. ఈ టోర్నీలో ఏ మ్యాచ్​ను తేలిగ్గా తీసుకోలేదని ఆమె తెలిపింది.

"సీనియర్ జాతీయ ఛాంపియన్​షిప్​లో విజయంతో ఉప్పొంగిపోతున్నా, ఇక్కడి వరకూ రావడానికి ఎంతో ప్రయాణం చేశా. జాతీయ ఛాంపియన్ గా నా పేరు చూడాలనుకున్నా అది ఇప్పటికి సాధ్యమైంది. ఈ టోర్నీలో ప్రతి మ్యాచ్ పై దృష్టి సారించా. ఏ ప్రత్యర్ధినీ తేలిగ్గా తీసుకోలేదు. సెమీస్​లో మాత్రమే ఒక్క సెట్ కోల్పోయా. ప్రతి మ్యాచ్​కూ ఆత్మవిశ్వాసంతో బరిలో దిగా, నా పూర్తిస్థాయి ఆటతీరు ప్రదర్శించా. ఇప్పుడిక అంతర్జాతీయ టోర్నీల్లో విజయాలు సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్నా. ఈ ఏడాది చివరిలోపు డబ్ల్యూటీఏ మహిళల సింగిల్స్ ర్యాంకింగ్స్ లో 500 (ప్రస్తుత ర్యాంకు 1100) లోపు స్థానం సంపాదించాలి" అని రోజుకు ఎనిమిది గంటలు సాధన చేసే రష్మిక చెప్పింది.

టోర్నీలకు పుస్తకాలతో: మనం ఎంచుకున్న కెరీర్​లో విజయవంతం కావాలంటే త్యాగాలు చేయక తప్పదని రష్మిక అభిప్రాయపడింది. ప్రతిరోజూ ఉదయం 4:30 గంటలకు దినచర్య మొదలెట్టే తను పొద్దున ధ్యానం, యోగా చేస్తుంది. ఆ తర్వాత సాయంత్రం వరకూ కోర్టులోనే గడు పుతోంది. దీంతో ఇతర అమ్మాయిల్లాగా తనకూ బయట సరదాగా గడపాలని ఉన్నా, రోజూ కళాశాలకు వెళ్లాలని ఉన్నా ఆట కారణంగా అది సాధ్యపడదని పేర్కొంది. నా రోజంతా టెన్నితోనే గడుస్తోంది. ప్రస్తుతం బేగంపేట్​లోని సెయింట్ ఫ్రాన్సిస్ కళాశాలలో బీకామ్ రెండో ఏడాది చదువుతున్నా. ఇతర అమ్మాయిల్లాగా బయట సరదాగా గడపాలనిపించినా ఆట కారణంగా అది కుదరదు.

ఏదైనా సాధించాలంటే కొన్ని త్యాగాలు తప్పవు కదా. అందుకే పూర్తిగా నా సమయమంతా ఆటకే కేటాయించా, పరీక్షలు ఉన్నపుడు చదువుతా. టోర్నీలకు కూడా పుస్త కాలు తీసుకెళ్లి.. ఖాళీ దొరికితే చదివేస్తా. పుస్తకాలు చదవడం సహా పాటు వంట చేయడం నాకు అలవాటు. లాక్​డౌన్ సమయంలో కొన్ని బేకరీ వంటలు చేయడం నేర్చు కున్నా, బిస్కెట్లు, కేకుల్లాంటివి తయారు చేస్తా" అని ఆమె వెల్లడించింది. ఇప్పటికే ఐటీఎఫ్ జూనియర్ గ్రేడ్ టోర్నీల్లో, ఆసియా ర్యాంకింగ్ పోటీల్లో సత్తా చాటిన రష్మిక.. ప్రొఫెషనల్ టెన్నిస్​లోనూ తనదైన ముద్ర వేయాలని అనుకుంటోంది. ఈ ఏడాది ట్యూనీషియా, ఐరోపాల్లో టోర్నీల్లో ఆడబోతుంది. తన ఆరాధ్య ఆటగాళైన ఫెదరర్, జకోవిచ్ లాగా గ్రాండ్ స్లామ్ గెలవడమే తన అంతిమ లక్ష్యమని చెబుతోంది. లాక్​డౌన్ విరామం తర్వాత తిరిగి లయ అందుకునేందుకు ఒక వారం రోజుల సమయం సరిపోయిందని ఆమె తెలిపింది.

ABOUT THE AUTHOR

...view details