ఫ్రెంచ్ ఓపెన్ ముంగిట నొవాక్ జకోవిచ్‌కు స్ఫూర్తినిచ్చే విజయం. ఈ సెర్బియా స్టార్ ఇటాలియన్ ఓపెన్ సొంతం చేసుకున్నాడు. సోమవారం జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో జకోవిచ్ 7-5, 6-3 తేడాతో స్క్వాట్జ్‌మ్యాన్ (అర్జెంటీనా)ను ఓడించాడు. తొలి సెట్లో ప్రత్యర్థి నుంచి పోటీ ఎదుర్కొన్న జకో.. పదకొండో గేమ్‌లో అతని సర్వీస్ బ్రేక్ చేసి సెట్ గెలిచాడు. రెండో సెట్లోనూ అదే జోరు ప్రదర్శించిన నొవాక్.. సెట్‌తో పాటు టైటిల్ సొంతం చేసుకున్నాడు. ఈ టోర్నీలో ఆటతో కాక తన చర్యలతో అంపైర్ల నుంచి హెచ్చరికలు అందుకున్న జకోకు తాజా విజయం ఊరటనిచ్చేదే.
ఇటాలియన్ ఓపెన్ విజేతలుగా జకోవిచ్, హలెప్ - సిమోనా హలెప్
ఇటాలియన్ ఓపెన్ పురుషుల సింగిల్స్‌లో సెర్బియా స్టార్ నొవాక్ జకోవిచ్, మహిళల సింగిల్స్‌లో రొమేనియాకు చెందిన సిమోనా హలెప్ విజేతలుగా నిలిచారు. ఫైనల్లో స్క్వాట్జ్మ్యాన్పై 7-5, 6-3 తేడాతో జకోవిచ్ విజయం సాధించాడు. మరోవైపు మహిళల సింగిల్స్‌లో చెక్ రిపబ్లిక్కు చెందిన కరోలినా ప్లిస్కోవా గాయం కారణంగా తప్పుకోగా హలెప్‌ను విజేతగా ప్రకటించారు.
మహిళల టైటిల్‌ను టాప్ సీడ్ సిమోనా హలెప్ (రొమేనియా) సాధించింది. ఫైనల్లో ఆమె 6-0, 2-1తో ఆధిక్యంలో ఉన్న సమయంలో ప్రత్యర్థి కరోలినా ప్లిస్కోవా (చెక్ రిపబ్లిక్) గాయం కారణంగా పోటీ నుంచి తప్పుకుంది. వెన్ను గాయంతో బాధపడిన కరోలినా.. వైద్యం తీసుకుంటూనే ఆటను కొనసాగించింది. తొలి సెట్లో మూడుసార్లు సర్వీస్ కోల్పోయిన ఈ చెక్ అమ్మాయి.. రెండో సెట్లోనూ వెనుకబడిన దశలో వైదొలిగింది. దీంతో ట్రోఫీ హలెప్ సొంతమైంది. 2017, 2018 సీజన్లలోనూ ఈ టోర్నీలో ఫైనల్ చేరిన సిమోనా.. విజేతగా నిలవడం ఇదే తొలిసారి. మొత్తం మీద ఈ సీజన్లో ఆమెకిది మూడో టైటిల్.