యూఎస్ ఓపెన్‌లో(US Open Tennis) టాప్‌సీడ్ జకోవిచ్(Djokovic US open) జోరు కొనసాగుతోంది. ఫామ్‌ను కొనసాగిస్తూ అతడు సెమీస్‌లో అడుగుపెట్టాడు. పురుషుల సింగిల్స్ క్వార్టర్స్‌లో జకోవిచ్ 5-7, 6-2, 6-2, 6-3 తేడాతో(Djokovic vs Berrettini) ఆరో సీడ్ బెరెటిని (ఇటలీ)పై విజయం సాధించాడు. ఈ టోర్నీలో వరుసగా మూడో మ్యాచ్‌లోనూ తొలి సెట్ కోల్పోయిన జకో.. తనదైన పోరాటంతో తిరిగి పుంజుకుని ప్రత్యర్థిని చిత్తుచేశాడు. మొదటి సెట్లో ఆటగాళ్లు సర్వీసును నిలబెట్టుకుంటూ చెరో గేమ్ గెలుచుకుంటూ సాగారు. స్కోరు 5-5తో సమమైన దశలో.. ప్రత్యర్థి సర్వీసును బ్రేక్ చేసిన బెరెటిని 6-5తో ఆధిక్యం సంపాదించాడు.
అదే జోరులో చివరి గేమ్‌నూ ఖాతాలో వేసుకుని సెట్ గెలిచాడు. కానీ అతనికా ఆనందం కొద్దిసేపు మాత్రమే. రెండో సెట్ నుంచి జకో ఆధిపత్యం మొదలైంది. నాలుగో గేమ్‌లో ప్రత్యర్థి సర్వీసును బ్రేక్ చేసి 3-1తో ఆధిక్యం సాధించిన అతను అదే దూకుడుతో సెట్ సొంతం చేసుకున్నాడు. మూడో సెట్ కూడా రెండో సెట్ మాదిరే కొనసాగింది. ప్రత్యర్థి సర్వీసులకు దీటుగా బదులిస్తూ.. తన షాట్లలో వేగాన్ని పెంచుతూ జకో అదరగొట్టాడు. క్రాస్ కోర్టు షాట్లు ఆడుతూ ప్రత్యర్థిని కోర్టుకు ఇరువైపులా పరుగెత్తించాడు. నెట్ దగ్గర తెలివిగా షాట్లు ఆడి పాయింట్లు రాబట్టాడు. నాలుగో సెట్లోనూ అదే ఉత్సాహంతో గెలిచాడు.