ప్రపంచ నంబర్ వన్ నొవాక్ జకోవిచ్ (సెర్బియా) (Novak Djokovic) అదరగొట్టాడు. వింబుల్డన్ (Wimbledon)లో హ్యాట్రిక్ కొట్టాడు. ఆదివారం ఆసక్తికరంగా సాగిన ఫైనల్లో జకోవిచ్ 6-7 (4-7), 6-4, 6-4, 6-3తో ఏడో సీడ్ బెరెటిని (ఇటలీ)పై విజయం సాధించాడు. తొలి సెట్‌ను అనూహ్యంగా ట్రైబ్రేక్‌లో కోల్పోయిన జకోవిచ్ క్రమంగా పుంజుకుని పైచేయి సాధించాడు. 34 ఏళ్ల జకోవిచ్‌కు ఈ ఏడాది ఇది మూడో గ్రాండ్‌స్లామ్ టైటిల్.
వింబుల్డన్ ట్రోఫీతో జకోవిచ్ తొలి సెట్ పోయినా..
ఆరంభంలో తడబడ్డ బెరెటిని(Matteo Berrettini) అనూహ్యంగా పుంజుకున్నాడు. దీంతో తొలి సెట్ అత్యంత రసవత్తరంగా సాగింది. ధాటిగా ఆటను ఆరంభించిన జకోవిచ్ చక్కని షాట్లతో ఆధిపత్యాన్ని ప్రదర్శించాడు. నాలుగో గేమ్‌లోనే బ్రేక్ సాధించి ఆధిక్యంలోకి దూసుకెళ్లాడు. జకోవిచ్ తేలిగ్గానే సర్వీసు నిలబెట్టుకోగా.. మంచి సర్వర్ అయినప్పటికీ బెరెటిని సర్వీసు కాపాడుకోవడానికి ఇబ్బందిపడ్డాడు. కానీ 9వ గేమ్‌తో ఆట గమనం అనూహ్యంగా మారిపోయింది. సెట్ కోసం సర్వ్ చేస్తూ జకోవిచ్ తడబడ్డాడు. క్రాస్ కోర్ట్ ఫోర్ హ్యాండ్ షాట్‌తో తొలి పాయింటు సాధించిన బెరెటిని.. పైచేయిని కొనసాగిస్తూ చివరికి ఓ ఫోర్ హ్యాండ్ షాట్‌తో బ్రేక్ సాధించాడు.
ఆ తర్వాత ఆట టైబ్రేక్‌కు వెళ్లగా.. బెరెటిని ఆధిపత్యాన్ని ప్రదర్శించాడు. 3-0 ఆధిక్యంలోకి వెళ్లాడు. తర్వాత జకోవిచ్ పుంజుకుని స్కోరును 3-3తో సమం చేసినా.. పదునైన సర్వీసులు చేసిన బెరెటినిదే చివరికి పైచేయి అయింది. కానీ తొలి సెట్ భంగపాటుతో జకోవిచ్ ఆత్మవిశ్వాసం కోల్పోలేదు. రెండో సెట్ బలంగా ఆరంభించాడు. మరింత కసిగా ఆడిన అతడు తొలి, మూడో గేముల్లో బ్రేక్‌లతో 4-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లాడు. జకోవిచ్ సర్వీసుల్లోనూ కచ్చితత్వం పెరిగింది. అతడు అలవోకగా సర్వీసు నిలబెట్టుకున్నాడు. అదే సమయంలో బెరెటిని సర్వీసులో లయ తప్పాడు. కానీ అతడు అంత తేలిగ్గా వదల్లేదు. 5-2 ఆధిక్యంతో జకోవిచ్ సర్వ్‌కు దిగగా.. బ్రేక్ సాధించిన బెరెటిని ఆటను ఆసక్తికరంగా మార్చాడు. కానీ జకో మరో తప్పు చేయలేదు. పదో గేమ్‌లో సర్వీసు నిలబెట్టుకుని రెండో సెట్‌ను చేజిక్కించుకున్నాడు. అదే జోరుతో మూడో సెట్ మూడో గేమ్‌లోనే బ్రేక్ సాధించి ఆధిక్యంలోకి దూసుకెళ్లాడు.
రన్నరప్ ట్రోఫీతో బెరెటిని అంతకుముందు సెట్లలోలా బెరెటిని బ్రేక్ సాధించలేకపోయాడు. చివరి వరకూ సర్వీసు నిలబెట్టుకున్న జకోవిచ్ మూడో సెట్‌ను చేజిక్కించుకున్నాడు. బెరెటిని పుంజుకోవడం వల్ల నాలుగో సెట్ ఆసక్తికరంగా సాగింది. బెరెటిని పదునైన సర్వీసులు చేశాడు. అతడు, జకోవిచ్ సర్వీసులు నిలబెట్టుకుంటూ సాగారు. ఆరో గేమ్‌లో బెరెటిని 30-0 ఆధిక్యంలో నిలిచి ప్రత్యర్థిని కలవర పెట్టాడు. కానీ జకోవిచ్ పుంజుకుని గేమ్ గెలిచాడు. జకో తర్వాతి గేమ్‌లో బ్రేక్ సాధించి ఆధిక్యంలోకి దూసుకెళ్లాడు. 30-40 వద్ద డబుల్ ఫాల్ట్ చేసి బెరెటిని దెబ్బతిన్నాడు. ఎనిమిదో గేమ్‌లో సర్వీసు నిలబెట్టుకున్న జకోవిచ్.. వెంటనే మరో బ్రేక్ సాధించి సెట్‌ను, ఛాంపియన్‌షిప్‌ను చేజిక్కించుకున్నాడు.
ఇదీ చదవండి:Wimbledon: వింబుల్డన్ విజేతగా బార్టీ
అతనో అద్భుతం..
కెరీర్ ఆరంభంలోనే అత్యుత్తమ ప్రత్యర్థులు ఎదురైతే. ముందు భయం మొదలవుతోంది.. ఆ తర్వాత ఒత్తిడి కలుగుతుంది. ప్రతి టోర్నీలోనూ విజయానికి అడ్డం వస్తుంటే.. ఇక గెలుపు దక్కదనే నిరాశ పుడుతుంది. ఆ నిరాశే కుంగుబాటుగా మారి చివరకు ఆటనే వదిలేయాల్సి వస్తుంది. కానీ జకోవిచ్ మాత్రం.. ఓటమి ఎదురైన ప్రతిసారి మరింత కసితో దూసుకొచ్చాడు. ట్రోఫీలు దక్కకపోయినా పోరాటం వదల్లేదు. ఆటనే నమ్ముకుని.. నైపుణ్యాలనే అస్త్రాలుగా మార్చుకుని.. అప్పటికే అగ్రశ్రేణి ఆటగాళ్లుగా మారిన ఫెదరర్, నాదల్‌పై పైచేయి సాధించడం అలవాటు చేసుకున్నాడు. ఇప్పుడు ఏకంగా అత్యధిక గ్రాండ్ స్లామ్ టైటిళ్లలో ఆ దిగ్గజాల సరసన చేరాడు. అందుకే అతనో అద్భుతం. ఆటకే కొత్త దారి చూపిన అతని ప్రతిభ, దిగ్గజాలకే ఎదురు నిలిచిన అతని తెగువ టెన్నిస్ చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోయేదే.
పురుషుల టెన్నిస్‌లో దిగ్గజం ఎవరంటే రెండేళ్ల క్రితం వరకూ ఫెదరర్ పేరు చెప్పుకునేవాళ్లు. పీట్ సంప్రాస్ అత్యధిక గ్రాండ్ స్లామ్ టైటిళ్ల రికార్డు (14)ను తిరగరాసిన ఫెదరర్ మొత్తం 20 విజయాలతో శిఖరాగ్రానికి చేరాడు. అయితే వయసు మీద పడటమే కాక గాయాలూ అతని జోరుకు బ్రేకులేశాయి. మరోవైపు జోరు కొనసాగించిన నాదల్ గతేడాది ఫ్రెంచ్ ఓపెన్ విజేతగా నిలిచి ఫెదరర్ సరసన చేరాడు. ఇక కొన్నేళ్లుగా అత్యుత్తమ ఫామ్ ప్రదర్శిస్తూ.. నిలకడగా రాణిస్తున్న జకోవిచ్ ఇప్పుడు వింబుల్డన్‌లో గెలిచి ఈ ఇద్దరిని సమం చేశాడు. ఇప్పుడీ ముగ్గురు తలో 20 గ్రాండ్ స్లామ్ టైటిళ్లతో అగ్రస్థానంలో ఉన్నారు. అయితే జకో ఈ స్థాయికి చేరుకోవడం వెనక సవాళ్లతో కూడిన ప్రయాణం ఉంది.
2005లో అతను తొలి గ్రాండ్‌స్లామ్ టోర్నీ బరిలో దిగాడు. అప్పటికే ఫెదరర్ నాలుగు గ్రాండ్ స్లామ్ టైటిళ్లతో జోరు మీదున్నాడు. ఇక 2003లో తొలి గ్రాండ్ స్లామ్ టోర్నీ ఆడిన నాదల్.. 2005 నుంచి టైటిళ్లు సాధించడం మొదలెట్టాడు. ఆ పరిస్థితుల్లో ఫెదరర్, నాదల్ నుంచి జకోవిచ్‌కు గట్టిపోటీ ఎదురైంది. దీంతో మూడేళ్లు గడిచినా ఒక్క గ్రాండ్ స్లామ్ టోర్నీలోనూ గెలవలేకపోయాడు. ఫ్రెంచ్ ఓపెన్‌లో నాదల్, మిగిలిన మూడు టోర్నీలైన ఆస్ట్రేలియన్ ఓపెన్, వింబుల్డన్, యుఎస్ ఓపెన్‌లో ఫెదరర్ జైత్రయాత్ర కొనసాగింది. దీంతో 2008లో కానీ గ్రాండ్ స్లామ్ బోణీ కొట్టలేకపోయాడు. ఆ తర్వాత రెండేళ్ల పాటు మళ్లీ నిరాశే. ఇలా అయితే లాభం లేదనుకుని, తన ఆటతీరును మరింత మెరుగుపర్చుకుని తిరిగి కోర్టులో అడుగు పెట్టిన జకో.. 2011 నుంచి ఫెదరర్, నాదల్‌పై పైచేయి సాధించే స్థాయికి ఎదిగాడు. ఇక అప్పటి నుంచి ఈ దిగ్గజ త్రయం మధ్య పోరు టెన్నిస్ అభిమానులను విశేషంగా అలరించడం షురూ అయింది. ఫెదరర్, నాదల్ సవాళ్లను ఎదుర్కొంటూనే నిలకడగా టైటిళ్లు సాధించడం జకో అలవాటు చేసుకున్నాడు. ఇక 2018 నుంచి అయితే అతని జోరు మామూలుగా లేదు. అతనాడిన గత 14 గ్రాండ్ స్లామ్‌ల్లో ఎనిమిదింట్లో విజయ దుందుభి మోగించాడు. ఈ ఏడాది వరుసగా ఆస్ట్రేలియన్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్ సొంతం చేసుకున్నాడు. ఇప్పుడతని ఫామ్‌ను చూస్తుంటే మరో నాలుగైదు టైటిళ్లు గెలిచి అత్యధిక టైటిళ్లతో ఎవరూ అందుకోలేని స్థానానికి చేరేలా ఉన్నాడు.
ఇదీ చదవండి:వింబుల్డన్ విన్నర్.. గతంలో క్రికెటర్ అని తెలుసా?