కరోనా వైరస్ ఆందోళనల కారణంగా ఆస్ట్రేలియా టెన్నిస్ క్రీడాకారుడు నిక్ కిర్గియోస్ యూఎస్ ఓపెన్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. మహమ్మారితో ప్రాణాలు కోల్పోయిన వేలాది మంది అమెరికన్ల గౌరవార్థం ఈ గ్రాండ్ టోర్నీ నుంచి వైదొలుగుతతున్నట్లు తెలిపాడు. అలాగే ఈ టోర్నీని ఆగస్టు 31 నుంచి సెప్టెంబరు 13 వరకు నిర్వహించాలనే ప్రణాళికతో యునైటెడ్ స్టేట్స్ టెన్నిస్ అసోసియేషన్ ముందుకు సాగడం వల్ల తనకు ఎలాంటి ఇబ్బంది లేదని వెల్లడించాడు.
"ఈ ఏడాది యూఎస్ ఓపెన్లో నేను ఆడటం లేదు. గొప్ప క్రీడా ప్రాంగణాల్లో ఒకటైన అర్థర్ ఆషె స్టేడియంలో ఆడకుండా ఉండటం నాకు బాధగానే ఉంది. కానీ ఈ మహమ్మారితో ప్రాణాలు కోల్పోయిన వేలాది మంది అమెరికన్ల కోసం, నా దేశ గౌరవార్థం ఈ నిర్ణయం తీసుకున్నా. మనం ఆటను, ఆర్థిక వ్యవస్థను తిరిగి పునఃనిర్మించుకోవచ్చు.. కానీ కోల్పోయిన జీవితాలను తిరిగి పొందలేము."