వెస్టర్న్ అండ్ సదరన్ ఓపెన్ నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించింది మాజీ ప్రపంచ టెన్నిస్ నంబర్‌వన్ నవోమి ఒసాకా. జాతివివక్షకు నిరసనగా ఆమె ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు వెల్లడించింది. అమెరికాలోని ఓ నల్లజాతీయుడైన జాకబ్ బ్లేక్పై జరిపిన కాల్పుల గురించి తెలుసుకున్న తర్వాత తాను తీవ్ర ఆవేదనకు లోనయినట్లు ట్వీట్లో పేర్కొంది.
"హలో, మీలో చాలా మందికి నేను తెలుసు. రేపు జరగనున్న వెస్టర్న్ అండ్ సదరన్ సెమీఫైనల్స్‌లో ఆడాల్సిఉంది. అయితే టెన్నిస్ ప్లేయర్ కంటే ముందు నేను నల్లజాతి మహిళను. ప్రస్తుతం నేను టెన్నిస్ ఆడటం కంటే జాతివివక్ష నిరసనలకు మద్దతుగా నిలవడం అవసరం అనిపిస్తుంది. నేను ఆడకపోతే ఏదో కోల్పోతానని అనుకోవడం లేదు. పోలీసుల చేతిలో నల్లజాతీయులు హతమవ్వడం చూసి కడుపు తరుక్కుపోతుంది. ఈ సమస్యల గురించి ప్రతిరోజూ మాట్లాడి విసిగిపోయా."
-నవోమి ఒసాకా, ప్రపంచ మాజీ టెన్నిస్ నంబర్ వన్