ప్రపంచ నెం.1 నొజొమి ఒసాకా (జపాన్) ఫ్రెంచ్ ఓపెన్ రెండో మ్యాచ్‌లో విజయం కోసం తీవ్రంగా శ్రమించింది. తొలి మ్యాచ్‌లో మూడు సెట్లు పోరాడి ఎలాగోలా ముందంజ వేసిన ఆమె.. రెండో రౌండ్లో ఓటమి కోరల్లోంచి బయటపడి టోర్నీలో నిలిచింది. గురువారం హోరాహోరీగా సాగిన మహిళల సింగిల్స్ రెండో రౌండ్లో ఒసాకా 4-6, 7-5, 6-3తో బెలారస్ భామ విక్టోరియా అజరెంకాపై చెమటోడ్చి నెగ్గింది.
తొలి సెట్లో ఓడి.. రెండో సెట్లోనూ 2-4తో వెనకబడి ఓటమి అంచున నిలిచిన ఒసాకా.. అసాధారణంగా పుంజుకుని విజయాన్ని సొంతం చేసుకుంది. రెండు గంటల 50 నిమిషాలు జరిగిన ఈ పోరులో అజరెంకా 52 విన్నర్లు కొట్టినా 43 అనసవర తప్పిదాలు చేసింది.
మరోవైపు అమెరికా తార సెరెనా విలియమ్స్ 6-3, 6-2తో నారా (జపాన్)ను ఓడించి మూడో రౌండ్ చేరింది. హలెప్ (రొమేనియా) 6-4, 5-7, 6-3తో లినెటె (పోలెండ్) నెగ్గింది. బెన్సిచ్ (స్విట్జర్లాండ్), సమంత స్టోసర్ (ఆస్ట్రేలియా), బార్టీ (ఆస్ట్రేలియా) మూడో రౌండ్ చేరారు.