జపాన్ అమ్మాయి నవోమి ఒసాకా అదరగొట్టింది.. అంచనాలను నిలబెట్టుకుంటూ మరో టైటిల్ ఖాతాలో వేసుకుంది. బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత తిరిగి కోర్టులోకి అడుగు పెట్టి గ్రాండ్‌స్లామ్ కోసం గట్టిగా ప్రయత్నిస్తున్న విక్టోరియా అజరెంక (బెలారస్)కు తీవ్ర నిరాశను కలిగిస్తూ ఈ మూడో సీడ్ టైటిల్ చేజిక్కించుకుంది. ఆసక్తికరంగా సాగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో ఒసాకా 1-6, 6-3, 6-3తో అజరెంకను ఓడించింది. మొదట తడబడినా.. తర్వాత శక్తిమంతమైన ఆటతో నవోమి ప్రత్యర్థిపై పైచేయి సాధించింది.
ఆరంభం విక్టోరియాదే
అవతల కోర్టులో యువ కెరటం.. కెరీర్‌లో ఆమెపై గెలిచింది ఒకసారే. కానీ 31 ఏళ్ల అజరెంక తన క్లాస్‌ను చూపించింది. వరుసగా పదకొండు మ్యాచ్‌లు నెగ్గి ఊపు మీదున్న ఈ బెలారస్ స్టార్.. తొలి సెట్లో సత్తా చాటింది. క్రాస్‌కోర్టు షాట్లు, బలమైన సర్వీసులతో ఒసాకాను ఉక్కిరిబిక్కిరి చేసిన విక్టోరియా.. తొలి గేమ్‌లోనే ప్రత్యర్థి సర్వీస్ బ్రేక్ చేసింది. ఆ తర్వాత ఆమె దూకుడు ముందు ఒసాకా నిలువలేకపోయింది. ఈ సెట్‌ను అజరెంక 6-1తో నెగ్గిందంటేనే ఆమె ఆధిపత్యాన్ని ఊహించొచ్చు. విక్టోరియా బలమైన సర్వీసులకు, నెట్ దగ్గరకు వేగంగా దూసుకొస్తూ వేసిన డ్రాప్ షాట్లకు ఒసాకా దగ్గర నుంచి బదులే లేకుండాపోయింది.
అక్కడ నుంచి నవోమి
రెండో సెట్‌లో ఆధిక్యం చేతులు మారుతూ వచ్చింది. రెండో గేమ్ ముగిశాక అజరెంక 2-0తో నిలిచింది. సుదీర్ఘ ర్యాలీలతో సాగిన మూడో గేమ్‌లో హోరాహోరీ పోరాడిన నవోమి.. అజరెంక సర్వీస్ బ్రేక్ చేయడం ఈ మ్యాచ్‌లో మలుపు. తర్వాత సర్వీస్ నిలబెట్టుకుని 2-2తో నిలిచిన ఆమె ఆపై శక్తిమంతమైన షాట్లతో విరుచుకుపడింది. విక్టోరియా అనవసర తప్పిదాలు చేయడం కూడా ఆమెకు కలిసొచ్చింది. ఏడో గేమ్‌లో బ్రేక్ సాధించిన ఒసాకా 4-3తో ఆధిక్యంలోకి వెళ్లడమే కాక ఆ తర్వాత 6-3తో సెట్ గెలిచి మ్యాచ్‌లో నిలిచింది.
ఒత్తిడిని జయించి..