ఫ్రెంచ్ ఓపెన్ మహిళల విభాగంలో బ్రిటన్ క్రీడాకారిణి జొహన్న కొంటా చరిత్ర లిఖించింది. అంచనాలకు మించి రాణించిన ఆమె... ఫ్రెంచ్ ఓపెన్ మహిళల సింగిల్స్ తుది నాలుగు జాబితాలో స్థానం కైవసం చేసుకుంది. క్వార్టర్స్‌లో 26వ సీడ్ కొంటా 6-1, 6-4 తేడాతో ఏడో సీడ్ స్లోన్ స్టీఫెన్స్ (అమెరికా)కు షాకిచ్చింది.
ఫ్రెంచ్ ఓపెన్: సెమీస్‌లో కొంటా- ఏడో సీడ్‌కు షాక్
ఫ్రెంచ్ ఓపెన్ మహిళల సింగిల్స్‌లో బ్రిటన్ టెన్నిస్ స్టార్ జొహన్న కొంటా అరుదైన ఘనత సాధించింది. ఏడో సీడ్ స్లోన్ స్టీఫెన్స్‌ను మట్టికరిపించి సెమీస్‌కు దూసుకెళ్లింది. 36 ఏళ్ల తర్వాత ఫ్రెంచ్ ఓపెన్‌లో సెమీస్ చేరిన తొలి బ్రిటీష్ మహిళగా చరిత్ర సృష్టించింది.
గతంలో నాలుగుసార్లు ఫ్రెంచ్ ఓపెన్ బరిలో దిగినా కూడా ఒక్క మ్యాచ్‌లోనూ విజయం సాధించని కొంటా... ఈసారి ఏకంగా సెమీస్ వరకూ చేరింది. తొలిసెట్‌ను పెద్దగా కష్టపడకుండానే ఆమె సొంతం చేసుకుంది. కొంటా జోరు ముందు స్టీఫెన్స్ నిలువలేకపోయింది. అయితే రెండో సెట్లో పుంజుకున్న స్టీఫెన్స్ ప్రత్యర్థికి గట్టి పోటీ ఇవ్వగలిగింది. కానీ కీలక సమయాల్లో చెలరేగిన కొంటా సెట్‌తో పాటు మ్యాచ్‌నూ కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో ఆరు ఏస్‌లు సంధించిన కొంటా.. 25 విన్నర్లు కొట్టింది.
జొహన్న కొంటా కంటే ముందు 1983లో బ్రిటన్ క్రీడాకారిణి జో డూరీ ఫ్రెంచ్ ఓపెన్ సెమీస్ చేరింది. మరలా 36 ఏళ్ల తరవాత ఈ రికార్డు అందుకుంది కొంటా.