ప్రతిష్ఠాత్మక టెన్నిస్ టోర్నీ డేవిస్‌కప్‌లో పాల్గొననుంది భారత జట్టు. పదేళ్లుగా పాకిస్థాన్ ఆతిథ్యమిస్తోన్న ఏ క్రీడలకు హాజరు కాని భారత ఆటగాళ్లు... దాదాపు 55 ఏళ్ల తర్వాత దాయాది దేశంలో టెన్నిస్ ఆడనున్నారు. ఈ టోర్నీలో తలపడేందుకు భారత జట్టు సెప్టెంబర్‌లో పాక్‌కు పయనం కానుంది. ఈ విషయంపై ఆల్ ఇండియా టెన్నిస్ సంఘం (ఏఐటీఏ) సెక్రటరీ జనరల్ హిరణ్మయి ఛటర్జీ స్పష్టత ఇచ్చారు.
" భారత జట్టు పాకిస్థాన్ పర్యటనకు వెళ్లనుంది. ఇది రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సిరీస్ కాదు. టెన్నిస్ ప్రపంచకప్ కాబట్టే వెళ్తున్నాం. ఇది అంతర్జాతీయ టోర్నీ కాబట్టి ప్రభుత్వం కల్పించుకోకుండా భారత టెన్నిస్ సంఘమే అన్ని పనులు చూసుకుంటోంది. జట్టు ఎంపిక, టోర్నీకి వెళ్లేందుకు చేసుకోవాల్సిన ఏర్పాట్ల విషయంలో కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ జోక్యం చేసుకోవట్లేదు. ఇప్పటికే పాకిస్థాన్ టెన్నిస్ సంఘానికి లేఖ రాశాం. పోటీలో పాల్గొనాలని వాళ్లూ అధికారికంగా సమాధానమిచ్చారు. ప్రస్తుతం వీసా పనులు జరుగుతున్నాయి. వీటికి నాలుగు, ఐదు వారాలు పట్టే అవకాశం ఉంది."
-- హిరణ్మయి ఛటర్జీ, ఏఐటీఏ సెక్రటరీ జనరల్
ఈ మెగా ఈవెంట్ ఇస్లామాబాద్ వేదికగా పాకిస్థాన్ క్రీడా ప్రాంగణంలో సెప్టెంబర్ 14, 15 తేదీలలో జరగనున్నాయి. డేవిస్ కప్‌లో భారత్ ఫిబ్రవరిలోనే డ్రా పొందినా.. పుల్వామా దాడి వల్లే దీనిపై సందిగ్ధం నెలకొంది. ఘటన తర్వాత 7 సార్లు సమావేశమైన బ్యాడ్మింటన్ సంఘం అధికారులు... చర్చల తర్వాత తుది నిర్ణయం తీసుకున్నారు.