భారత దిగ్గజ డబుల్స్ క్రీడాకారుడు లియాండర్ పేస్.. బెంగళూరు ఓపెన్ టెన్నిస్ టోర్నీలో సెమీఫైనల్స్‌కు చేరాడు. గురువారం జరిగిన పురుషుల డబుల్స్ క్వార్టర్స్‌లో ఆస్ట్రేలియా ప్లేయర్ మాథ్యూ అబ్డెన్‌తో కలిసి పేస్ అదరగొట్టాడు. ప్రత్యర్థులైన ఆండ్రీ గొరన్సన్ (స్వీడన్)- క్రిస్టోఫర్ (ఇండోనేషియా) జోడీపై 7-5, 0-6, 10-7తో విజయం సాధించాడు.
ఈ ఏడాదే పేస్ వీడ్కోలు...
భారత టెన్నిస్ చరిత్రలో అరుదైన ఘనతలు సొంతం చేసుకుని.. ఎందరో యువతకు స్ఫూర్తిగా నిలిచే ఆటగాడు లియాండర్ పేస్. ఇతడు రాకెట్ పట్టి కోర్టులో కనిపించేది మరో కొన్ని నెలలు మాత్రమే. ఈ ఏడాది ప్రొఫెషనల్ టెన్నిస్‌కు వీడ్కోలు పలకనున్నట్లు గతంలో ప్రకటించాడు. 18 గ్రాండ్‌స్లామ్ డబుల్స్ టైటిళ్లు ఖాతాలో వేసుకున్న 46 ఏళ్ల పేస్.. డేవిస్ కప్‌లో 44 విజయాలతో టెన్నిస్ చరిత్రలోనే అత్యంత విజయవంతమైన డబుల్స్ ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు.
ఈ ఏడాది టోక్యో ఒలింపిక్స్‌లో ఆడడం ద్వారా వరుసగా ఎనిమిది ఒలింపిక్స్‌లో ప్రాతినిధ్యం వహించిన ఏకైక టెన్నిస్ ఆటగాడిగా రికార్డు నమోదు చేయడంపై పేస్ దృష్టి సారించాడు. మూడు దశాబ్దాల కెరీర్‌లో అతను ఎన్నో ఘనతలు సొంతం చేసుకున్నాడు. 1996 అట్లాంటా ఒలింపిక్స్ టెన్నిస్ సింగిల్స్‌లో కాంస్యం గెలిచిన ఈ ప్లేయర్... ఆ ఘనత సాధించిన ఏకైక భారత ఆటగాడిగా నిలిచిపోయాడు.