తెలంగాణ

telangana

ETV Bharat / sports

సంచనాల స్వైటక్.. ఫ్రెంచ్ ఓపెన్ విజేతగా - Iga Swiatek latest news

ఈసారి ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్​ గెలుచుకోవడం సహా పలు సరికొత్త రికార్డులు సృష్టించింది టీనేజీ సెన్సేషన్ స్వైటక్. శనివారం రాత్రి జరిగిన ఫైనల్​లో కెనిన్ విజయం సాధించి, ఈ ఘనత నమోదు చేసింది.

Iga Swiatek wins French Open
సంచనాల స్వైటక్.. ఫ్రెంచ్ ఓపెన్ విజేతగా

By

Published : Oct 11, 2020, 6:43 AM IST

ఆడుతోంది తొలి ఫైనల్‌.. అవతల ఓ గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ గెలిచిన ప్రత్యర్థి! అయినా ఇగా స్వైటక్‌ తగ్గలేదు.. తన విజయాలు గాలివాటం కాదని నిరూపిస్తూ.. సంచలనాలను కొనసాగిస్తూ ఈ 19 ఏళ్ల పోలెండ్‌ అమ్మాయి ఫ్రెంచ్‌ టైటిల్‌ ఎగరేసుకుపోయింది. శనివారం ఏకపక్షంగా సాగిన మహిళల సింగిల్స్‌ తుది సమరంలో స్వైటక్‌ 6-4, 6-1తో నాలుగో సీడ్‌ సోఫియా కెనిన్‌ (అమెరికా)ను ఓడించింది. కేవలం గంటా 24 నిమిషాల్లోనే మ్యాచ్‌ను ముగించింది. తొలిసారి గ్రాండ్‌స్లామ్‌ ఫైనల్‌ ఆడుతున్నాననే ఒత్తిడి లేకుండా స్వైటక్‌ తనదైన శైలి ఆటతీరుతో అదరగొట్టింది.

"ఫైనల్‌ మ్యాచ్‌ను కూడా తొలి రౌండ్‌ మ్యాచ్‌గానే భావిస్తా. అలా అయితేనే ఎలాంటి ఒత్తిడి ఉండదు" అని కెనిన్‌తో టైటిల్‌ పోరుకు ముందు చెప్పిన స్వైటక్‌ అదే విధంగా చెలరేగింది. తొలి సెట్‌ ఆరంభంలోనే 3-0తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఆ తర్వాతి మూడు గేమ్‌లను కెనిన్‌ నెగ్గడం వల్ల స్కోరు 3-3తో సమమైంది. దీంతో ఆట ఆసక్తికరంగా మారింది. ఇద్దరూ క్రీడాకారిణులు పాయింట్ల కోసం హోరాహోరీగా పోటీపడడం వల్ల గేమ్‌లు ఎక్కువ సేపు సాగాయి. ఆ దశలో తన ఫోర్‌హ్యాండ్‌, బ్యాక్‌హ్యాండ్‌ షాట్లతో చెలరేగిన స్వైటక్‌ వరుసగా రెండు గేమ్‌లు గెలిచి 5-3తో విజయానికి చేరువైంది. కానీ స్వైటక్‌ సర్వీస్‌ను బ్రేక్‌ చేసిన కెనిన్‌ తిరిగి పోటీలోకి వచ్చేలా కనిపించింది. అయితే ఆమెకు ఆ అవకాశం దక్కకుండా చేస్తూ స్వైటక్‌ మరో బ్రేక్‌ పాయింట్‌ సాధించి సెట్‌ను సొంతం చేసుకుంది.

సంచనాల స్వైటక్.. ఫ్రెంచ్ ఓపెన్ విజేతగా

రెండో సెట్లో ఆమె మరింత విజృంభించింది. ఇప్పటికే ఓ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీ గెలిచిన కెనిన్‌కు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా చెలరేగింది. రెండో సెట్లో ప్రత్యర్థి ఒక్క గేమ్‌ మాత్రమే గెలిచిందంటేనే ఆమె దూకుడు ఏ స్థాయిలో కొనసాగిందో అర్థం చేసుకోవచ్చు. స్వైటక్‌ సర్వీస్‌ను బ్రేక్‌ చేసి, తొలి గేమ్‌ సాధించిన కెనిన్‌ ఆ తర్వాత పూర్తిగా వెనకబడింది. అక్కడి నుంచి ఆటంతా స్వైటక్‌దే. ప్రత్యర్థి సర్వీస్‌ను బ్రేక్‌ చేస్తూ.. తన సర్వీస్‌ను నిలబెట్టుకుంటూ ముందుకు సాగిన ఆమెను కెనిన్‌ అందుకోలేకపోయింది. మ్యాచ్‌లో ఓ ఏస్‌ సంధించిన స్వైటక్‌.. 25 విన్నర్లు కొట్టింది.

"చాలా ఆనందంగా ఉంది. ఫ్రెంచ్‌ ఓపెన్‌లో ప్రతిసారీ నా అభిమాన ఆటగాడు నాదల్‌ టైటిల్‌ అందుకుంటుంటే చూస్తూ ఉండేదాన్ని. ఈ సారి నేనూ ట్రోఫీ అందుకుంటుంటే ఆ భావన వింతగా ఉంది. కుటుంబసభ్యుల మధ్య విజేతగా నిలిచినందుకు ఆనందంగా ఉంది" - స్వైటక్‌

  • 1 - గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ గెలిచిన తొలి పోలెండ్‌ క్రీడాకారిణి స్వైటక్‌. 2007 (హెనిన్‌) తర్వాత టోర్నీలో ఒక్క సెట్‌ కూడా కోల్పోకుండా విజేతగా నిలిచిన మొదటి క్రీడాకారిణి కూడా తనే. 1997 (19 ఏళ్ల వయసులో మజోలీ) తర్వాత ఈ టోర్నీలో విజేతగా నిలిచిన టీనేజీ అమ్మాయిగా స్వైటక్‌ రికార్డు సాధించింది.
  • 2 - ఫ్రెంచ్‌ ఓపెన్‌లో అన్‌సీడెడ్‌గా బరిలో దిగి టైటిల్‌ సాధించిన రెండో అమ్మాయి స్వైటక్‌. తొలి స్థానంలో ఓస్టాపెంకో (2017) ఉంది.
  • 17 - ప్రస్తుతం ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 54వ స్థానంలో ఉన్న స్వైటక్‌ ఈ విజయం తర్వాత 17వ ర్యాంక్‌కు చేరనుంది. విజేతగా నిలిచిన స్వైటక్‌ సుమారు రూ.13 కోట్ల ప్రైజ్‌మనీ సొంతం చేసుకుంది.

ABOUT THE AUTHOR

...view details