తెలంగాణ

telangana

ETV Bharat / sports

బోపన్న X ఐటా: ఒలింపిక్​ అర్హతపై ముదురుతున్న వివాదం - అఖిల భారత టెన్నిస్‌ సంఘం

భారత టెన్నిస్​ స్టార్​ ప్లేయర్​ రోహన్​ బోపన్న, అఖిల భారత టెన్నిస్ సంఘం(ఐటా) మధ్య వివాదం వేడెక్కింది. టోక్యో ఒలింపిక్స్​ అర్హతకు సంబంధించి ఐటా తప్పుదోవ పట్టించిందని బోపన్న విమర్శిస్తుండగా.. అతడికి మరో టెన్నిస్ స్టార్​ సానియా మీర్జా మద్దతుగా నిలిచింది. దీనిపై ఐటా ఘాటుగా స్పందించింది. వాళ్లిద్దరూ ప్రపంచ టెన్నిస్ సమాఖ్య రూల్స్​ పుస్తకంలో ఒలింపిక్స్​ అర్హత నిబంధనలు చదువుకోవాలని సూచించింది. అసలు వివాదం ఎలా మొదలైందంటే..?

rohan bopanna, AITA
రోహన్ బోపన్న, ఐటా

By

Published : Jul 20, 2021, 6:58 AM IST

టోక్యో ఒలింపిక్స్‌ అర్హతకు సంబంధించి టెన్నిస్‌ డబుల్స్‌ స్పెషలిస్టు రోహన్‌ బోపన్న, అఖిల భారత టెన్నిస్‌ సంఘం (ఐటా) మధ్య మాటల యుద్ధం దుమారం రేపుతోంది. కంబైన్డ్‌ ర్యాంకింగ్‌లో దివిజ్‌ శరణ్‌తో కలిసి టోక్యోకు అర్హత సాధించలేకపోయిన బోపన్నను సుమిత్‌ నగాల్‌తో కలిసి డబుల్స్‌ ఆడేందుకు అనుమతించాలని ప్రపంచ టెన్నిస్‌ సమాఖ్య (ఐటీఎఫ్‌)ను ఐటా కోరింది. దీంతో ఈ వివాదం రాజుకుంది. ఒకసారి జట్టు ప్రతిపాదన చేశాక మార్పు చేర్పులకు ఎలాంటి అవకాశం లేదని ఐటీఎఫ్‌ ముందే చెప్పినా.. ఐటా మాత్రం ఇప్పటిదాకా అవకాశం ఉందని చెబుతూ తప్పుదోవ పట్టించిందని బోపన్న విమర్శించాడు. బోపన్న తనంతట తాను ఒలింపిక్స్‌కు అర్హత సాధించలేకపోవడం వల్ల అతడిని టోక్యో పంపేందుకు సాయం చేస్తున్నామని ఐటా బదులిచ్చింది. మరోవైపు సానియా మీర్జా.. బోపన్న పక్షాన నిలుస్తూ ఐటాపై విమర్శలు గుప్పించింది. దీంతో ఈ వివాదం మరింత వేడెక్కింది.

ర్యాంకింగ్‌ ఆధారంగా ఒలింపిక్స్‌ అవకాశం దక్కకపోగా.. తమకన్నా తక్కువ ర్యాంకు ఆటగాళ్లకు టోక్యో టిక్కెట్‌ ఇచ్చి తమకు అన్యాయం చేశారని బోపన్న ఇటీవల ఐటీఎఫ్‌ను విమర్శించాడు. తాజాగా చాలామంది ఆటగాళ్లు ఒలింపిక్స్‌ నుంచి తప్పుకోవడం వల్ల సింగిల్స్‌ ఆటగాడు సుమిత్‌ నగాల్‌కు టోక్యో బెర్తు దొరికింది. ఈ నేపథ్యంలో నగాల్‌తో పాటు బోపన్నను డబుల్స్‌ ఆడించాలనుకుంటున్నట్లు ఐటీఎఫ్‌కు ఐటా తాజా ప్రతిపాదనలో వెల్లడించింది.

ఇదీ చదవండి:వయసేమో 97​.. రాకెట్​ పడితే కుర్రాడు

"నాతో పాటు సుమిత్‌కు ఒలింపిక్స్‌లో పోటీపడేందుకు అవకాశం ఇవ్వడానికి ప్రపంచ టెన్నిస్‌ సమాఖ్య నిరాకరించింది. జూన్‌ 22న ప్రతిపాదనలకు అర్హత గడువు ముగిసినందున ఇప్పటికే అర్హత సాధించిన ఎవరైనా గాయపడడమో.. లేక అనారోగ్యంతో వైదొలిగితేనో మాత్రమే కొత్త ఎంట్రీలకు అవకాశం ఉంటుందని ఐటీఎఫ్‌ స్పష్టంగా చెప్పింది. మరోవైపు అఖిల భారత టెన్నిస్‌ సంఘం మాత్రం మాకు ఇంకా అవకాశం ఉందంటూ క్రీడాకారులే కాక ప్రభుత్వాన్ని, మీడియాను తప్పుదోవ పట్టించింది" అని బోపన్న ట్వీట్‌ చేశాడు.

మరో టెన్నిస్‌ స్టార్‌ సానియా మీర్జా కూడా ఈ ట్వీట్‌కు సానుకూలంగా స్పందించింది. "ఇది నిజమే అయితే అర్ధరహితం, సిగ్గుచేటు. సుమిత్‌తో పాటు నీ పేరు ఇచ్చామనడం వల్ల మనిద్దరం కలిసి బరిలో దిగే అవకాశం కోల్పోయాం. మిక్స్‌డ్‌ డబుల్స్‌లో పతకావకాశం చేజారింది" అని సానియా ట్వీట్‌ చేసింది.

బోపన్న, సానియాల విమర్శలపై ఐటా స్పందించింది. "ట్విట్టర్‌లో బోపన్న, సానియా చేసిన వ్యాఖ్యలు సహేతుకంగా లేవు. వాళ్లు ఐటీఎఫ్‌ రూల్స్‌ పుస్తకంలో ఒలింపిక్స్‌ అర్హత నిబంధనలను ఒకసారి చదువుకోవాలి. బోపన్న నేరుగా అర్హత సాధించకపోవడం వల్ల అతడు ఒలింపిక్స్‌కు వెళ్లేందుకు మేం సాయం చేశాం" అని ఐటా పేర్కొంది. బోపన్న (38వ ర్యాంకు), దివిజ్‌ శరణ్‌ (75వ ర్యాంకు) ఇద్దరి ర్యాంకులు కలిపి 113 ఉండడం వల్ల ఒలింపిక్స్‌కు నేరుగా అర్హత సాధించే అవకాశాన్ని కోల్పోయారు. "ఇంతకుముందు చేసిన ప్రతిపాదనలో మార్పు చేస్తున్నట్లు ఐటీఎఫ్‌కు లేఖ రాశాం. నగాల్‌కు తోడుగా బోపన్నను డబుల్స్‌లో ఆడేందుకు ప్రతిపాదించాం. సింగిల్స్‌లో సుమిత్‌ అర్హత సాధిస్తే డబుల్స్‌లో అతడికి భాగస్వామిగా బోపన్ననే ఆడించాలని ముందే అనుకున్నాం. ఇందులో తప్పుదోవ పట్టించడం ఏముంది? అయినా బోపన్న తన సొంతగా ఒలింపిక్స్‌కు ఎందుకు అర్హత సాధించలేకపోయాడు" అని ఐటా ప్రశ్నించింది.

ఇదీ చదవండి:Olympics: ఒలింపిక్స్​కు దూరమైన టెన్నిస్ యువ సంచలనం

ABOUT THE AUTHOR

...view details