స్పెయిన్ టెన్నిస్ స్టార్ రఫెల్ నాదల్ అభిమానులను అయోమయానికి గురిచేశాడు. 'నాకు పెళ్లైంది' అని ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేయడం వల్ల అంతా తికమక పడ్డారు. గతంలోనే పెళ్లైంది కదా? ఫ్రెంచ్ ఓపెన్ మధ్యలో ఎలా పెళ్లి చేసుకున్నావ్? అని కొందరు సందేహం వ్యక్తం చేశారు. మరికొందరేమో 'మీ ఇద్దరికీ వివాహ శుభాకాంక్షలు!' అని తెలియజేశారు.
వాస్తవంగా 2019, అక్టోబర్‌లోనే ఫ్రానిస్కా పరెల్లొను నాదల్ పెళ్లాడాడు. ఆమెతోనే జీవితాన్ని ఆస్వాదిస్తున్నాడు. అతడి ఫేస్‌బుక్ పేజీ 'About'లో 2019 నుంచి వివాహితుడినే అని ఉండటం గమనార్హం. అయితే ఆదివారం అర్ధరాత్రి అతడు 'నాకు పెళ్లైంది' అని పోస్ట్ చేయడం వల్ల గందరగోళం మొదలైంది.
'రఫాకు, అతడి భార్యకు అభినందనలు!! మీ ఇద్దరికీ ఎప్పుడో పెళ్లైందనే అనుకున్నా! చూస్తుంటే కాలేదని అనిపిస్తోంది', 'ఈ బాంబుతో ఎంతమంది హృదయాలు ముక్కలయ్యాయో!! కానీ 2019లోనే కదా ఇలా జరిగింది?', 'అభినందనలు. కానీ తికమక పడ్డాను. అతడికి 2019 అక్టోబర్‌లోనే పెళ్లైందని వికీపేజీలో ఉంది', 'కంగ్రాట్స్! కానీ ఫ్రెంచ్ ఓపెన్ మధ్యలో ఎలా పెళ్లి చేసుకున్నావో ఊహకు తట్టడం లేదు', 'ఇది సరికాదు. అతడికి 2019లోనే పెళ్లైంది' అని అభిమానులు కామెంట్లు పెడుతున్నారు.
ప్రస్తుతం రఫెల్ నాదల్ ఫ్రెంచ్ ఓపెన్ ఆడుతున్నాడు. తనను ఎప్పట్నుంచో ఊరిస్తున్న 21వ గ్రాండ్‌స్లామ్ టైటిల్ కొట్టాలను తహతహలాడుతున్నాడు. నాలుగో రౌండ్‌కు చేరుకున్నాడు.
ఇదీ చూడండి French Open: టైటిల్ వేటలో నాదల్కు ఎదురుందా?