ఫ్రెంచ్ ఓపెన్: జకోవిచ్ మ్యాచ్‌కు వర్షం అడ్డంకి
ఫ్రెంచ్ ఓపెన్ ఒక సెమీ ఫైనల్లో నాదల్ ఫైనల్ చేరగా.. మరో మ్యాచ్ మధ్యలో ఆగిపోయింది. ప్రపంచ నంబర్ వన్ జకోవిచ్- నాలుగో సీడ్ థీమ్ మధ్య మ్యాచ్‌లో ఫైనలిస్టు ఎవరనేది తేలనివ్వకుండా వర్షం అడ్డుకుంది. శనివారం ఆట కొనసాగించనున్నారు.
ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో మరో ఫైనలిస్టును నిర్ణయించే మ్యాచ్ ఉత్కంఠ పరిస్థితిలో ఆగిపోయింది. వర్షం కారణంగా నాదల్‌తో టైటిల్ కోసం తలపడే ఆటగాడు ఎవరన్నది తేలలేదు. శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్ రెండో సెమీస్‌లో ప్రపంచ నంబర్‌వన్ నొవాక్ జకోవిచ్ (సెర్బియా)... నాలుగో సీడ్ డొమినిక్ థీమ్ (ఆస్ట్రియా) మధ్య పోరుకు వర్షం ఆటంకం కలిగించింది. మ్యాచ్‌ను వాయిదా వేసే సమయంలో జకోవిచ్ 2-6, 6-3, 1-3 తేడాతో థీమ్ కన్నా కాస్త వెనుకంజలో ఉన్నాడు. ఇద్దరూ చెరో సెట్ గెలిచి మూడో సెట్లో విజయం కోసం పోరాడుతున్నారు. ఆటను తిరిగి శనివారం కొనసాగించనున్నారు.