కరోనా కాలంలో ఈ ఏడాది చివరి టెన్నిస్ గ్రాండ్‌స్లామ్ టోర్నీకి రంగం సిద్ధమైంది. ఫ్రెంచ్ ఓపెన్‌కు ఆదివారమే తెరలేవనుంది. ఎప్పటిలాగే రఫెల్ నాదల్ ఈ టోర్నీలో ఫేవరేట్. ఫెదరర్ 20 గ్రాండ్‌స్లామ్ టైటిళ్లను సమం చేయాలనే పట్టుదలతో నాదల్ (19) ఉండగా.. రఫెల్‌ను ఓడించి ఫ్రెంచ్ ఓపెన్ గెలవాలన్న లక్ష్యంతో ఉన్నాడు ప్రపంచ నంబర్ వన్ జకోవిచ్. మహిళల విభాగంలో మార్గరెట్ కోర్ట్ (24) పేరిట ఉన్న అత్యధిక గ్రాండ్‌స్లామ్ టైటిళ్లను రికార్డును సమం చేసేందుకు మరో ప్రయత్నం చేయనుంది అమెరికా దిగ్గజం సెరెనా విలియమ్స్. ఎవరి కల నెరవేరుతుందో చూడాలి.
ఫ్రెంచ్ ఓపెన్.. ఈ పేరు వినగానే ముందుగా గుర్తుకువచ్చే ఆటగాడు నాదల్ (స్పెయిన్) అనడంలో అతిశయోక్తి లేదు. ఇప్పటివరకూ మరెవరికీ సాధ్యం కాని రీతిలో ఏకంగా 12 సార్లు అతను ఈ ఎర్రమట్టి కోర్టుపై జెండా ఎగరవేశాడు. 2005 నుంచి ఈ టోర్నీలో పోటీపడుతోన్న అతను ఇప్పటివరకూ 93 మ్యాచ్‌ల్లో గెలిచి.. కేవలం రెండింట్లో మాత్రమే ఓడాడు. ఈ సారి కూడా ట్రోఫీ అందుకోవడమే లక్ష్యంగా బరిలో దిగుతున్నాడు. ఏడు నెలలుగా ఆటకు దూరంగా ఉన్న అతను ఈ టోర్నీ కోసం సన్నద్ధమవడానికే యుఎస్ ఓపెన్‌కూ దూరమయ్యాడు. ఈ టైటిల్ గెలిస్తే అతడు ఫెదరర్ ఆల్‌టైమ్ గ్రాండ్‌స్లామ్ టైటిళ్ల రికార్డును సమం చేస్తాడు.
అయితే పురుషుల సింగిల్స్‌లో నాదల్కు కాస్త కఠినమైన డ్రా పడింది. ఈ టోర్నీకి సన్నాహకంగా జరిగిన ఇటాలియన్ ఓపెన్‌లో అతను క్వార్టర్స్‌లోనే నిష్క్రమించాడు. అయినప్పటికీ ఈ ప్రపంచ రెండో ర్యాంకర్ ఆటగాడు ఫ్రెంచ్ ఓపెన్ అంటే మాత్రం ఎప్పటిలాగే చెలరేగిపోతాడనే అంచనాలతో కోర్టులో అడుగుపెడుతున్నాడు. అతనికి నంబర్‌వన్ ఆటగాడు జకోవిచ్, యూఎస్ ఓపెన్ విజేత థీమ్ నుంచి గట్టిపోటీ ఎదురయ్యే వీలుంది. టైటిల్ ఫేవరేట్‌గా బరిలో దిగి అనుకోకుండా లైన్ అంపైర్‌ను గాయపర్చడం వల్ల యూఎస్ ఓపెన్ నుంచి అర్ధాంతరంగా తప్పుకున్న జకోవిచ్.. ఇటాలియన్ ఓపెన్‌లో విజేతగా నిలిచి ఫామ్ చాటుకున్నాడు. ఫ్రెంచ్ ఓపెన్‌లో అతను గెలిస్తే నాలుగు గ్రాండ్‌స్లామ్ టైటిళ్లను ఒకటి కంటే ఎక్కువ సార్లు గెలిచిన తొలి ఆటగాడిగా నిలుస్తాడు.
గతేడాది రన్నరప్, యూఎస్ ఓపెన్ విజేత థీమ్ ఈ సారి ట్రోఫీ సొంతం చేసుకోవాలనే ధ్యేయంతో ఉన్నాడు. ముర్రే, వావ్రింకా, జ్వెరెవ్, మెద్వెదెవ్, సిట్సిపాస్ లాంటి ఆటగాళ్లు కూడా టైటిల్ వేటలో ఉన్నారు. ఫెదరర్ గాయం కారణంగా ఈ టోర్నీకి దూరమయ్యాడు.