తెలంగాణ

telangana

ETV Bharat / sports

French Open: క్వార్టర్స్​కు జకోవిచ్​, నాదల్​ - french open quarter finals djoko0vic

ప్రపంచ నం.1 జకోవిచ్‌కు(Djokovic) చెమటలు పట్టాయ్‌! కళ్లుచెదిరే ఆటతో 19 ఏళ్ల లొరెంజో ముసెటి (ఇటలీ) సంచలనం సృష్టించేలా కనిపించినా అసాధారణంగా పుంజుకున్న నొవాక్‌ ఫ్రెంచ్‌ ఓపెన్‌(French Open) క్వార్టర్స్‌కు దూసుకెళ్లాడు. నాదల్‌(Nadal) కూడా ముందంజ వేయగా, మహిళల సింగిల్స్‌లో కొకోగాఫ్‌(Coco Gauff), సకారి(Sakari) కూడా తుది ఎనిమిదిలో చోటు దక్కించుకున్నారు.

Djokovic
జకోవిచ్

By

Published : Jun 8, 2021, 6:24 AM IST

రొలాండ్‌ గారోస్‌లో(French Open) మాజీ ఛాంపియన్‌ జకోవిచ్‌(Djokovic) తడబడి నిలిచాడు! తొలి రెండు సెట్లు కోల్పోయినా.. ప్రత్యర్థి జోరు మీదున్నా గొప్పగా ఆడి నిలిచిన ఈ టాప్‌సీడ్‌ క్వార్టర్‌ఫైనల్లో చోటు సంపాదించాడు. సోమవారం హోరాహోరీగా సాగిన పురుషుల సింగిల్స్‌ ప్రిక్వార్టర్స్‌లో లారెంజో ముసెటి (ఇటలీ)పై జకోవిచ్‌ 6-7 (7/9), 6-7 (2/7), 6-1, 6-0, 4-0తో ఆధిక్యంలో ఉన్న స్థితిలో ప్రత్యర్థి గాయంతో వైదొలిగాడు.

ఆ మూడు సెట్లు

ఈ మ్యాచ్‌లో 19 ఏళ్ల ముసెటి అనూహ్యంగా తొలి రెండు సెట్లను టైబ్రేకర్‌లో గెలిచాడు. అతడి జోరు చూస్తే జకోవిచ్‌పై విజయం సాధ్యమే అనిపించింది. కానీ మూడో సెట్‌ నుంచి కథ మారిపోయింది. ఇలాంటి మ్యాచ్‌లు ఎన్నో ఆడిన అనుభవం ఉన్న జకో ఎదురుదాడికి దిగాడు. ముసెటిని ఉక్కిరిబిక్కిరి చేస్తూ పాయింట్లు సాధించాడు. నెట్‌ దగ్గరకు ఉరికి వస్తూ అతడు కొట్టిన షాట్లకు ఇటలీ టీనేజర్‌ దగ్గర బదులే లేదు. ఒక్క తొలి సెట్‌ గెలిచేందుకే ముసెటికి 75 నిమిషాలు పట్టగా.. మూడు, నాలుగు సెట్‌లు చేజిక్కించుకోవడానికి జకోవిచ్‌ కేవలం 40 నిమిషాలే ఖర్చు చేయడం విశేషం. ముఖ్యంగా నాలుగో సెట్లో అతడు కేవలం నాలుగు పాయింట్లే కోల్పోయి సెట్‌ గెలుచుకున్నాడు. అయిదో సెట్‌ తొలి గేమ్‌లో జారిపడినా.. జకో అద్భుత రీతిలో రిటర్న్‌ చేశాడు. ఆ పాయింట్‌ను అతడే గెలుచుకున్నాడు. ఈ క్రమంలో అతడి వేలికి గాయమైంది. చికిత్స తీసుకున్నాక ఆట కొనసాగించిన జకో.. జోరుగా ఆడి ముసెటి సర్వీస్‌ బ్రేక్‌ చేసి ఆధిక్యంలోకి వెళ్లాడు. అదే జోరుతో 4-0తో ఆధిక్యంలో నిలిచిన సమయంలో ప్రత్యర్థి గాయంతో తప్పుకున్నాడు. జకో వరుసగా 13 గేమ్‌లు గెలవడం విశేషం. అర్జెంటీనా ఆటగాడు ష్వార్జ్‌మాన్‌ కూడా క్వార్టర్స్‌ చేరుకున్నాడు. ప్రిక్వార్టర్స్‌లో ఈ పదోసీడ్‌ 7-6 (11/9), 6-4, 7-5తో స్ట్రాఫ్‌ (జర్మనీ)పై విజయం సాధించాడు. ఈ మ్యాచ్‌లో స్ట్రాఫ్‌ నుంచి గట్టిపోటీ ఎదురైనా ఒత్తిడిని అధిగమిస్తూ ష్వార్జ్‌మాన్‌ విజయాన్ని అందుకున్నాడు. ఈ పోరులో స్ట్రాఫ్‌ 13 ఏస్‌లతో పాటు 39 విన్నర్లు కొట్టినా 53 అనవసర తప్పిదాలు చేయడం అతడిని ముంచింది.

గాఫ్‌ దూకుడు

అమెరికా టీనేజర్‌ కొకోగాఫ్‌(Coco Gauff) రొలాండ్‌ గారోస్‌లో దూసుకెళ్తోంది. ఆమె చాలా సులువుగా క్వార్టర్‌ఫైనల్లో ప్రవేశించింది. మహిళల సింగిల్స్‌ ప్రిక్వార్టర్స్‌లో గాఫ్‌ 6-3, 6-1తో జబెర్‌ (ట్యునీసియా)పై విజయం సాధించింది.క్వార్టర్స్‌లో బార్బారా క్రెజికోవా (చెక్‌ రిపబ్లిక్‌)తో గాఫ్‌ తలపడనుంది. మరో ప్రిక్వార్టర్స్‌లో క్రెజికోవా 6-2, 6-0తో 2018 ఫ్రెంచ్‌ ఓపెన్‌ రన్నరప్‌ స్లోన్‌ స్టీఫెన్స్‌ (అమెరికా) పోరాటానికి తెరదించింది. ఈ పోరులో స్లోన్‌ ప్రతిఘటన తొలి సెట్‌కే పరిమితమైంది. బలమైన షాట్లతో విరుచుకుపడి రెండో సెట్లో స్లోన్‌కు ఒక్క గేమ్‌ కూడా ఇవ్వకుండా నెగ్గిన క్రెజికోవా.. సెట్‌తో పాటు మ్యాచ్‌ను కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో క్రెజికోవా అయిదుసార్లు ప్రత్యర్థి సర్వీస్‌ బ్రేక్‌ చేయగా.. స్టీఫెన్స్‌ మాత్రం ఒక్కసారి కూడా బ్రేక్‌ సాధించలేకపోయింది. ఒక గ్రాండ్‌స్లామ్‌ టోర్నీలో క్వార్టర్‌ఫైనల్‌ దశకు చేరడం క్రెజికోవా, గాఫ్‌లకు ఇదే తొలిసారి. గత 15 ఏళ్లలో గ్రాండ్‌స్లామ్‌ క్వార్టర్స్‌లో ప్రవేశించిన పిన్న వయస్కురాలిగా గాఫ్‌ (17 ఏళ్లు) మరో ఘనత సొంతం చేసుకుంది. మరోవైపు నాలుగో సీడ్‌ కెనిన్‌ (అమెరికా) ఇంటిముఖం పట్టింది. ఆమె 1-6, 3-6తో సకారి (గ్రీస్‌) చేతిలో ఓడింది. కెనిన్‌ ఓటమితో టాప్‌-10లో స్వైటెక్‌ మాత్రమే పోటీలో మిగిలింది.

బోపన్న జోడీ ఔట్‌

ఫ్రెంచ్‌ ఓపెన్లో భారత కథ ముగిసింది. డబుల్స్‌లో రోహన్‌ బోపన్న(Rohan Bopanna) పరాజయం చవిచూశాడు. క్వార్టర్స్‌లో బోపన్న-ఫ్రాంకో కుగర్‌ (క్రొయేషియా) 5-7, 3-6తో పాబ్లో అండుజార్‌-పెడ్రో మార్టినెజ్‌ (స్పెయిన్‌) చేతిలో వరుస సెట్లలో ఓడారు.

తుది ఎనిమిదిలో రఫా

14వ ఫ్రెంచ్‌ ఓపెన్‌ టైటిల్‌పై గురిపెట్టిన రఫెల్‌ నాదల్‌(Nadal) క్వార్టర్‌ఫైనల్లో ప్రవేశించాడు. ప్రిక్వార్టర్స్‌లో రఫా 7-5, 6-3, 6-0తో యానిక్‌ సినర్‌ (ఇటలీ)ని ఓడించాడు. తొలి సెట్లో సినర్‌ 5-3తో సెట్‌కు చేరువయ్యాడు. కానీ పుంజుకున్న నాదల్‌ 9, 12 గేముల్లో బ్రేక్‌లు సాధించి 7-5తో సెట్‌ గెలుచుకున్నాడు. అక్కడ నుంచి రఫాను ఆపడం సినర్‌ వల్ల కాలేదు. రెండో సెట్‌ను 6-3తో నెగ్గిన నాదల్‌.. మూడో సెట్లో ఒక్క గేమ్‌ సినర్‌కు ఇవ్వకుండా సెట్‌తో పాటు, మ్యాచ్‌ను గెలుచుకున్నాడు.

క్వార్టర్స్‌లో ఎవరితో ఎవరు

  • జకోవిచ్‌ (సెర్బియా) × బెరిటిని (ఇటలీ)
  • ష్వార్జ్‌మాన్‌ (అర్జెంటీనా) × నాదల్‌ (స్పెయిన్‌)
  • జ్వెరెవ్‌ (జర్మనీ) × డేవిడోవిచ్‌ (స్పెయిన్‌)
  • సిట్సిపాస్‌ (గ్రీస్‌) × మెద్వెదెవ్‌ (రష్యా)

ఇదీ చూడండి: French Open: టైటిల్​ వేటలో నాదల్​కు ఎదురుందా?

ABOUT THE AUTHOR

...view details