ఆస్ట్రేలియా తార బార్టీ(Ashleigh Barty) గట్టెక్కింది.. ఫ్రెంచ్ ఓపెన్లో(French Open)రెండో రౌండ్ చేరేందుకు ఈ ప్రపంచ నంబర్‌వన్ మూడు సెట్లు ఆడాల్సి వచ్చింది. మంగళవారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో బార్టీ 6-4, 3-6, 6-2తో అమెరికా అమ్మాయి బెర్నార్డా పెరాపై గెలిచింది. పెద్దగా ఇబ్బంది పడకుండానే తొలి సెట్‌ను గెలిచిన బార్టీ రెండో సెట్లో తడబడింది. మోకాలి గాయం బాధిస్తుండడం వల్ల కోర్టులో కదలడానికి చాలా ఇబ్బంది పడింది.
కాలికి కట్టు కట్టుకుని ఆడిన ఆమె 3-6తో సెట్ కోల్పోయింది. మూడో సెట్లో తీవ్ర ఒత్తిడిలో ఆడిన బార్టీ నెమ్మదిగా పుంజుకుంది. ఆరో గేమ్‌లో ప్రత్యర్థి సర్వీస్ బ్రేక్ చేసి 4-2తో ఆధిక్యంలోకి వెళ్లిన ఆమె ఆ తర్వాత అదే జోరుతో తర్వాత రెండు గేమ్‌లు కూడా సొంతం చేసుకుని సెట్‌తో పాటు మ్యాచ్‌ను దక్కించుకుంది.
2019లో ఈ టోర్నీలో టైటిల్ గెలిచిన బార్టీ.. గతేడాది టోర్నీకి దూరమైంది. అయిదో సీడ్ స్వితోలినా కూడా ముందంజ వేసింది. ఆమె 6-2, 7-5తో బాబెల్ (ఫ్రాన్స్)ను ఓడించింది. మ్లదనోవిచ్ (ఫ్రాన్స్), సకారి (గ్రీస్) కూడా తొలి రౌండ్ అధిగమించారు. మ్లదనోవిచ్ 6-4, 6-0తో సిమిద్లోవా (స్లోవేకియా)ను ఓడించగా.. సకారి 6-4, 6-1తో జవాస్కా (ఉక్రెయిన్)పై నెగ్గింది. అమెరికా స్టార్ సెరెనా విలియమ్స్ రెండో రౌండ్ చేరింది.
ఏడో సీడ్ సెరెనా 7-6 (8/6), 6-2తో ఇరినా బెగు (రొమేనియా)పై గెలిచింది. మరోవైపు అమెరికా స్టార్ వీనస్ విలియమ్స్, ముగురుజ (స్పెయిన్) ఓడిపోయారు. తొలి రౌండ్లో వీనస్ 3-6, 1-6తో అలెగ్జాండ్రోవా (రష్యా) చేతిలో చిత్తు కాగా.. పన్నెండో సీడ్ ముగురుజ 1-6, 4-6తో మార్టా (ఉక్రెయిన్) చేతిలో ఓడింది. పెట్రా క్విటోవా (చెక్ రిపబ్లిక్) గాయం కారణంగా టోర్నీ నుంచి వైదొలిగింది.