ఫ్రెంచ్ ఓపెన్‌లో పదో సీడ్ అజరెంక (బెలారస్) కథ ముగిసింది. బుధవారం మహిళల సింగిల్స్ రెండో రౌండ్లో ఆమె 2-6, 2-6 తేడాతో అన్నా కరోలిన (స్లోవేకియా) చేతిలో చిత్తయింది. తొలిరౌండ్లో మాజీ నంబర్‌వన్ వీనస్ విలియమ్స్‌కు షాకిచ్చిన 161వ ర్యాంకర్ కరోలిన.. అదే దూకుడు కొనసాగించి 14వ ర్యాంకర్ అజరెంకను ఓడించడం విశేషం. తొలి గేమ్‌లోనే ప్రత్యర్థి సర్వీస్‌ను బ్రేక్ చేసింది కరోలిన. పదునైన ఏస్‌లు, బలమైన సర్వీసులతో చెలరేగి 3-1తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. అదే జోరులో తొలి సెట్‌ను గెలుచుకుంది.
రెండో సెట్లోనూ అజరెంకపై కరోలిన ఆధిపత్యం చెలాయించింది. ఈ మ్యాచ్‌లో కరోలిన 17 విన్నర్లు కొట్టింది. ఉత్కంఠభరితంగా సాగిన మరో మ్యాచ్‌లో అయిదో సీడ్ బెర్టీన్స్ (నెదర్లాండ్స్) 7-6 (7-5), 3-6, 9-7తో సారా (ఇటలీ)పై కష్టపడి నెగ్గింది. ఈ మ్యాచ్ 3 గంటల 11 నిమిషాల పాటు సాగింది. టైబ్రేకర్‌లో ఫలితం తేలిన తొలి సెట్‌ను బెర్టీన్స్ గెలిచింది. కానీ రెండో సెట్లో అనూహ్యంగా పుంజుకున్న ప్రత్యర్థి.. బెర్టీన్స్కు షాకిచ్చింది.
ఇక నిర్ణయాత్మక మూడో సెట్లో పోరాటం మరో స్థాయికి చేరింది. 16 గేమ్‌ల పాటు సాగిన ఆ సెట్లో ప్రత్యర్థికి రెండుసార్లు మ్యాచ్ పాయింట్ గెలిచే అవకాశమివ్వని బెర్టీన్స్.. చివరకు బ్యాక్‌హ్యాండ్ విన్నర్‌తో విజయం సాధించింది. టాప్‌సీడ్ హలెప్ (రొమేనియా) 6-3, 6-4తో తన దేశానికే చెందిన కమేలియాపై గెలిచింది. మంచి ఫామ్‌లో ఉన్న ఆమె వరుస సెట్లలో ప్రత్యర్థిని చిత్తుచేసింది. హలెప్ మ్యాచ్‌లో రెండు ఏస్‌లు, 15 విన్నర్లు కొట్టింది.
ఇతర మ్యాచ్‌ల్లో మూడో సీడ్ స్వితోలినా (ఉక్రెయిన్) 6-3, 0-6, 6-2తో జరాజువా (మెక్సికో)పై, సకారి (గ్రీస్) 7-6 (7-0), 6-2తో రఖిమోవా (రష్యా)పై, మార్టిన్స్ (బెల్జియం) 6-4, 7-5తో కనెపి (ఇస్తోనియా)పై నెగ్గారు. 23వ సీడ్ పుతింత్సెవ (కజకిస్థాన్) 3-6, 6-1, 2-6తో నదియా (అర్జెంటీనా) చేతిలో ఓడింది. అనిసిమోవ (అమెరికా) కూడా ముందంజ వేసింది.