పోలెండ్ టీనేజ్ టెన్నిస్ తార స్వియాటెక్ ఫ్రెంచ్ ఓపెన్‌లో సంచలనం సృష్టించింది. దూకుడైన ఆటతో టాప్ సీడ్ సిమోనా హలెప్ (రొమేనియా)ను ఇంటిముఖం పట్టించింది. ఆదివారం మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో అన్ సీడెడ్ స్వైటక్ 6-1, 6-2తో హలెప్‌ను చిత్తు చేసి క్వార్టర్స్‌కు దూసుకెళ్లింది. కేవలం 45 నిమిషాల్లోనే ముగిసిన ఈ సమరంలో బేస్‌లైన్ ఆటతో, నెట్ ప్లేతో అదరగొట్టిన 19 ఏళ్ల స్వైటక్.. తొలి సెట్లో రెండుసార్లు హలెప్ సర్వీస్ బ్రేక్ చేసి 26 నిమిషాల్లోనే సెట్ సొంతం చేసుకుంది.
రెండో సెట్లో తొలి గేమ్‌లోనే సర్వీస్ కోల్పోయిన హలెప్.. ఇక పుంజుకోలేకపోయింది. అయిదో గేమ్‌లో సిమోనా సర్వీస్‌ను మరోసారి బ్రేక్ చేసిన స్వైటక్.. సెట్‌తో పాటు మ్యాచ్‌ను గెలుచుకుంది. గతేడాది రొలాండ్ గారోస్‌లో హలెప్.. స్వైటక్పైనే గెలిచి క్వార్టర్ చేరడం విశేషం. ప్రపంచ 54వ ర్యాంకర్ స్వైటక్కు గ్రాండ్‌స్లామ్ టోర్నీలో ఇదే అత్యుత్తమ ప్రదర్శన.
మరోవైపు అయిదోసీడ్ కికి బెర్టెన్స్ 4-6, 4-6తో మార్టినా ట్రెవిసాన్ చేతిలో పరాజయం చవిచూసింది. ఈ మ్యాచ్‌లో నాలుగుసార్లు సర్వీస్ కోల్పోవడమే కాకుండా రెండు డబుల్‌ఫాల్ట్స్ చేసిన బెర్టెన్స్ ఓటమి కొనితెచ్చుకుంది. ఇంకో మ్యాచ్‌లో ముగురుజ (స్పెయిన్) 5-7, 6-2, 4-6తో డానియల్ కొలిన్స్ (అమెరికా) చేతిలో ఓడగా.. మూడోసీడ్ స్వితోలినా (ఉక్రెయిన్), పొడొరోస్కా (అర్జెంటీనా) క్వార్టర్స్‌లో అడుగుపెట్టారు. స్వితోలినా 6-1, 6-3తో గార్సియా (ఫ్రాన్స్)పై, పొడొరోస్కా 2-6, 6-2, 6-3తో క్రెజ్సికోవా (చెక్ రిపబ్లిక్)పై విజయం సాధించారు.