తెలంగాణ

telangana

ETV Bharat / sports

French Open: మూడో రౌండ్​కు జకోవిచ్​, ఫెదరర్​ - ఆష్లే బార్టీ

రెండోసారి ఫ్రెంచ్‌ ఓపెన్‌(French Open) గెలవాలనే పట్టుదలతో ఉన్న ప్రపంచ నం.1 నొవాక్‌ జకోవిచ్‌(Djokovic) ఈ టోర్నీలో మరో అడుగు ముందుకేశాడు. అతడు పెద్దగా కష్టపడకుండానే మూడో రౌండ్‌ చేరాడు. స్విస్‌ మాస్టర్‌ రోజర్‌ ఫెదరర్‌(Federer) కూడా ముందంజ వేశాడు. మహిళల సింగిల్స్‌లో కెనిన్‌, స్వితోలినా రెండో రౌండ్‌ దాటగా, ప్లిస్కోవా ఇంటిముఖం పట్టింది.

Federer, Djokovic advance to 3rd round at French Open
French Open: మూడో రౌండ్​కు జకోవిచ్​, ఫెదరర్​

By

Published : Jun 4, 2021, 6:37 AM IST

టాప్‌సీడ్‌ నొవాక్‌ జకోవిచ్‌(Djokovic) జోరు మీదున్నాడు. దూకుడైన ఆటతో ఫ్రెంచ్‌ ఓపెన్లో(French Open) ఈ సెర్బియా యోధుడు మూడో రౌండ్‌కు దూసుకెళ్లాడు. గురువారం పురుషుల సింగిల్స్‌ రెండో రౌండ్లో జకో 6-3, 6-2, 6-4తో పాబ్లో క్యూవాస్‌ (ఉరుగ్వే)ను ఓడించాడు. ఈ మ్యాచ్‌లో తొలి సెట్లో మాత్రమే జకోకు పాబ్లో పోటీ ఇచ్చాడు. ఆ తర్వాత నొవాక్‌ జోరుకు ఎదురే లేకపోయింది.

మరోవైపు స్విస్‌ దిగ్గజం ఫెదరర్‌(Federer) కూడా మూడో రౌండ్‌ చేరాడు. ఈ ఎనిమిదో సీడ్‌ 6-2, 2-6, 7-6 (7/4), 6-2తో మారిన్‌ సిలిచ్‌ (క్రొయేషియా)పై కష్టపడి గెలిచాడు. పదో సీడ్‌ ష్వార్జ్‌మాన్‌ (అర్జెంటీనా) ముందంజ వేయగా, 14వ సీడ్‌ మోన్‌ఫిల్స్‌ (ఫ్రాన్స్‌)కు చుక్కెదురైంది. ష్వార్జ్‌మాన్‌ 6-4, 6-2, 6-4తో బెదెన్‌ (స్లొవేనియా)పై నెగ్గగా.. మోన్‌ఫిల్స్‌ 0-6, 6-2, 4-6, 3-6తో యెమెర్‌ (స్వీడన్‌) చేతిలో కంగుతిన్నాడు. డానియల్‌ మెద్వెదెవ్‌ (రష్యా), బెరిటిని (ఇటలీ), కోల్‌స్కీబర్‌ (జర్మనీ) రెండో రౌండ్లో గెలిచారు.

ప్లిస్కోవా ఔట్‌

మహిళల విభాగంలో తొమ్మిదో సీడ్‌ ప్లిస్కోవా(pliskova) (చెక్‌ రిపబ్లిక్‌) పరాజయంపాలైంది. రెండో రౌండ్లో ఆమె 5-7, 1-6తో స్లోన్‌ స్టీఫెన్స్‌ (అమెరికా) చేతిలో ఓడింది. అయిదో సీడ్‌ స్వితోలినా (ఉక్రెయిన్‌) తర్వాతి రౌండ్‌ చేరింది. ఆమె 6-0, 6-4తో ఆన్‌ లీ (అమెరికా)పై విజయం సాధించింది. నాలుగో సీడ్‌ కెనిన్‌ (అమెరికా), ముచోవా (చెక్‌ రిపబ్లిక్‌), క్రెజికోవా (చెక్‌ రిపబ్లిక్‌) కూడా మూడో రౌండ్లో ప్రవేశించారు.

కెనిన్‌ 7-5, 6-3తో బాప్టిస్టె (అమెరికా)పై గెలవగా, ముచోవా 6-3, 6-4తో లెప్చెంకో (అమెరికా)ను ఓడించింది. క్రెజికోవా 6-2, 6-3తో అలెగ్జాండ్రోవా (రష్యా)పై నెగ్గింది. కొకో గాఫ్‌ (అమెరికా), మెర్టిన్స్‌ (బెల్జియం), కొస్తుక్‌ (ఉక్రెయిన్‌), సకారి (గ్రీస్‌), బ్రాడీ (అమెరికా), సబలెంక (బెలారస్‌), బదోసా (స్పెయిన్‌) కూడా రెండో రౌండ్‌ అధిగమించారు.

బోపన్న ముందుకు..

డబుల్స్‌లో రోహన్‌ బోపన్న(Rohan Bopanna) జోడీ మూడో రౌండ్‌ చేరింది. రెండో రౌండ్లో బోపన్న-ఫ్రాంకో కుగర్‌ (క్రొయేషియా) 6-4 7-5తో ఫ్రాన్సిస్‌ టియాఫో-నికోలాస్‌ (అమెరికా)పై విజయం సాధించారు. ప్రస్తుతం డబుల్స్‌లో 40వ ర్యాంకులో ఉన్న బోపన్నకు ర్యాంకింగ్‌ పాయింట్లు పెంచుకోవాలంటే రొలాండ్‌ గారోస్‌లో మరింత ముందుకెళ్లడం అవసరం. జూన్‌ 10 నాటికి ర్యాంకింగ్‌ను బట్టి టోక్యో బెర్తులు నిర్ణయమవుతాయి.

బార్టీ ఔట్‌

టాప్‌సీడ్‌ ఆష్లె బార్టీ(Ashleigh Barty) ఫ్రెంచ్‌ ఓపెన్‌ నుంచి అనూహ్యంగా నిష్క్రమించింది. మగ్దా లినెటె (పోలెండ్‌)తో రెండో రౌండ్‌ మ్యాచ్‌లో 1-6, 2-2తో ఉన్న సమయంలో గాయం ఇబ్బంది పెట్టడం వల్ల ఆమె మ్యాచ్‌ నుంచి అర్ధంతరంగా వైదొలిగింది. ప పెరా (అమెరికా)తో తొలి మ్యాచ్‌లో కష్టపడి ఆడి ఎలాగోలా గెలిచిన ఈ ప్రపంచ నం.1 బార్టీ.. మాగ్దాతో పోరులో మాత్రం ఆటను కొనసాగించలేకపోయింది. కాలికి కట్టు కట్టుకుని ఆడాలని ప్రయత్నించి విఫలమైంది. 2019 ఫ్రెంచ్‌ ఓపెన్‌ ఛాంపియన్‌ అయిన బార్టీ.. గతేడాది టోర్నీకి దూరమైంది. ఈసారి ఆమె పోరాటం రెండో రౌండ్‌కే పరిమితమైంది.

డబుల్స్‌ జోడీకి పాజిటివ్‌..

ఫ్రెంచ్‌ ఓపెన్‌కు కరోనా సెగ(french open corona) తగిలింది. ఓ డబుల్స్‌ జోడీ పాజిటివ్‌గా తేలింది. వాళ్లెవరన్నది నిర్వాహకులు చెప్పలేదు. అయితే ఆ ఇద్దరు క్రీడాకారులను టోర్నీ నుంచి తప్పించి క్వారంటైన్‌లో ఉంచినట్లు సమాచారం. వీరికి బదులు జాబితాలో తర్వాత స్థానంలో ఉన్న మరో జంటకు టోర్నీలో ఆడే అవకాశం ఇవ్వనున్నారు. మొత్తం 2446 పరీక్షలు చేయగా.. ఇద్దరికి కొవిడ్‌ సోకినట్లు వెల్లడైందని ఫ్రెంచ్‌ టెన్నిస్‌ సమాఖ్య తెలిపింది.

ఇదీ చూడండి:French Open: మూడో రౌండ్లో సెరెనా, జ్వెరెవ్

ABOUT THE AUTHOR

...view details