కరోనా మహమ్మారి కారణంగా బయో సెక్యూర్ బబుల్ (బుడగ)లో క్రీడా టోర్నీలు నిర్వహించాల్సి వస్తోందని.. క్రీడాకారులకు కఠినమైన క్వారంటైన్ ఆంక్షలు విధించినప్పటికీ అది కేవలం ఆట కోసమేనని ఒలింపియన్ విష్ణువర్ధన్ అన్నాడు. సోమవారం ఆరంభమయ్యే ఆస్ట్రేలియన్ ఓపెన్ పురుషుల సింగిల్స్‌లో.. మన దేశానికి చెందిన సుమిత్ నగాల్ రాణించే అవకాశం ఉందని అతను తెలిపాడు. 'ఈనాడు'తో మాట్లాడిన ఈ హైదరాబాద్ టెన్నిస్ ఆటగాడు ఎన్నో విషయాలు పంచుకున్నాడు. ఆ విశేషాలు అతని మాటల్లోనే..!
ఆస్ట్రేలియన్ ఓపెన్ కోసం ఆటగాళ్లకు 14 రోజల కఠిన క్వారంటైన్ విధించారు. ప్రస్తుత పరిస్థితుల్లో అది తప్పదు. కష్టమైనా ఆట కోసం ఆంక్షలు అమలు చేయాల్సిందే. ఇది ఆటగాళ్ల ప్రదర్శనపై ప్రభావం చూపే వీలుందనే ఉద్దేశంతో ఆస్ట్రేలియన్ ఓపెన్ ఆరంభానికి ముందు ప్రాక్టీస్ కోసం డబ్ల్యూటీఏ, ఏటీపీ టోర్నీలు నిర్వహిస్తున్నారు. ఈ టోర్నీలో భారత ఆటగాడు సుమిత్ నగాల్ ఆకట్టుకుంటాడనే నమ్మకంతో ఉన్నా. గత కొన్నేళ్లుగా అతని ఆటతీరు మెరుగవుతోంది. వైల్డ్‌కార్డు ద్వారా టోర్నీలో అడుగుపెట్టబోతున్న అతను.. పురుషుల సింగిల్స్‌లో సత్తాచాటతాడు. మరోవైపు డబుల్స్‌లో బోపన్న, దివిజ్ శరణ్ జోడీలు కూడా రాణిస్తాయని అనుకుంటున్నా. పురుషుల సింగిల్స్‌లో థీమ్ (ఆస్ట్రియా), మహిళల సింగిల్స్‌లో సెరెనా (యుఎస్) టైటిళ్లు గెలుస్తారని నా అంచనా.