మాజీ డబుల్స్ నంబర్‌వన్ టెన్నిస్ క్రీడాకారిణి పెంగ్ షువాయి ఫొటోలు తాజాగా ఆన్‌లైన్‌లో ప్రత్యక్షమవడం కలకలం రేపింది. దీంతో ఆమె ఆచూకీపై ఆందోళనలు మరింత పెరుగుతున్నాయి. చైనా మాజీ ప్రభుత్వ ఉన్నతాధికారి జాంగ్ తనపై లైంగిక హింసకు పాల్పడ్డాడని ఆరోపించినప్పటి నుంచి ఆ దేశానికే చెందిన పెంగ్ కనిపించడం లేదు. దీంతో ప్రపంచవ్యాప్తంగా టెన్నిస్ వర్గాల నుంచి, ఇతరుల నుంచి ఆందోళనలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో తాజాగా అక్కడి సీజీటీఎన్ ఛానెల్ ఉద్యోగి షెన్ షీవీ.. పెంగ్ ఫొటోలను ట్విట్టర్‌లో పోస్టు చేయడం చర్చనీయాంశమైంది. వీచాట్ అనే సామాజిక మాధ్యమంలో పెంగ్ స్వయంగా ఈ ఫొటోలు పోస్టు చేసిందని షెన్ ట్వీట్‌లో తెలిపాడు.
అక్కడి అధికార కమ్యూనిస్ట్ పార్టీ ప్రచురించే ఆంగ్ల పత్రిక గ్లోబల్ టైమ్స్ ఎడిటర్ హూ జిజిన్.. "అనధికార సమాచారం ప్రకారం ఈ ఫొటోలు పెంగ్ ప్రస్తుత స్థితిని తెలుపుతున్నాయి. గత కొన్ని రోజులుగా ఆమె తన సొంత ఇంట్లోనే స్వేచ్ఛగా ఉంది. తనకెలాంటి ఆటంకం కలగకూడదని అనుకుంటోంది. త్వరలోనే ఆమె బయటకు వచ్చి కార్యకలాపాలు సాగిస్తుంది" అని ట్వీట్ చేశారు.