ఆస్ట్రేలియన్ ఓపెన్ నుంచి మాజీ యూఎస్ ఓపెన్ ఛాంపియన్ బియాంకా ఆండ్రెస్కు నిష్క్రమించింది. రెండో రౌండ్లో తైవాన్ ప్లేయర్ సై సు వీ చేతిలో 6-3, 6-2 తేడాతో పరాజయం పాలైంది. ప్రత్యర్థి ముందు ఆండ్రెస్కు నిలవలేకపోయింది. తాను ఓడిపోయినప్పటికీ.. తిరిగి ఆటలోకి రావడం సంతోషంగా ఉందని తెలిపింది.
2019 యూఎస్ ఓపెన్ ఫైనల్లో సెరెనా విలియమ్స్‌ను మట్టికరిపించి టైటిల్ సొంతం చేసుకున్న ఆండ్రెస్కు.. మోకాలి గాయం కారణంగా 2020 ఏడాది మొత్తం ఆటకు దూరమైంది. తిరిగి ప్రస్తుతం ఆస్ట్రేలియన్ ఓపెన్ టోర్నీలో మళ్లీ రాకెట్ పట్టింది.
మరో గేమ్‌లో సెరెనా విలియమ్స్, సెర్బియన్ ప్లేయర్ నైనా స్టోజనోవిక్ను ఓడించింది. 6-3, 6-0 తేడాతో ప్రత్యర్థిని చిత్తుచేసింది సెరెనా. మొదటి రౌండ్ గెలిచాక రెండో రౌండ్ తేలికైందని ఈ అమెరికన్ ప్లేయర్ తెలిపింది.
గత ఎనిమిదేళ్ల తర్వాత టాప్ టోర్నీ ఆడుతున్న కెనడా క్రీడాకారిణి రెబెక్కా మారినో కూడా ఓటమి చవిచూసింది. 19వ సీడ్ ప్లేయర్ మార్కెటా వండ్రోసోవా చేతిలో 6-1, 7-5 తేడాతో పరాజయం పాలైంది.
పురుషుల సింగిల్స్‌లో రష్యా ఆటగాడు అస్లాన్ కరత్సేవ్ చేతిలో బెలారస్ ఆటగాడు ఎగోర్ గెరాసిమోవ్ ఓడిపోయాడు. 6-0, 6-1, 6-0 తేడాతో ఘోర ఓటమిని చవిచూశాడు. మరో వైపు, ఫ్రెంచ్ ఆటగాడు అలెగ్జాండర్ ముల్లర్‌పై అర్జెంటీనా క్రీడాకారుడు డియెగో స్క్వార్ట్జ్మాన్ విజయం సాధించాడు.