వచ్చే జనవరిలో జరగాల్సిన ఆస్ట్రేలియన్ ఓపెన్ నిర్వహణ తేదీలను వచ్చే రెండు వారాల్లోపు ప్రకటించే అవకాశముందని టెన్నిస్ ఆస్ట్రేలియా వెల్లడించింది. ఆ దేశంలో కరోనా వ్యాప్తి కారణంగా ఆ టోర్నీని ఫిబ్రవరి, మార్చిలో లేదా అంతకంటే ఆలస్యంగా నిర్వహించే అవకాశాలున్నాయని వస్తున్న వార్తలపై టెన్నిస్ ఆస్ట్రేలియా సీఈఓ క్రెయిగ్ స్పందించారు.
"వీలైనంత త్వరగా ఆస్ట్రేలియన్ ఓపెన్ తేదీలను ప్రకటించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం. ఈ వేసవిలో ఆటగాళ్లు బాగా సన్నద్ధమై టోర్నీలో ఉత్తమ ప్రదర్శన చేసే అవకాశం కల్పించడం సహా అభిమానులకు టెన్నిస్ వినోదాన్ని అందించడం మా బాధ్యత. సురక్షితమైన వాతావరణంలో జరిగేలా చూడడం మా లక్ష్యం. ఆటగాళ్ల, అభిమానులు, మా భాగస్వాముల అవసరాలు, క్వారంటైన్ తదితర అంశాలపై విక్టోరియా ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నాం. ఈ టోర్నీ ద్వారా విక్టోరియాతో పాటు ఆస్ట్రేలియా ప్రభుత్వానికి ఆర్థికంగా లాభం చేకూర్చడం ప్రధాన ఉద్దేశం. స్టేడియాల్లోకి అనుమతించే ప్రేక్షకుల సంఖ్య, టికెట్ల విక్రయాల గురించి త్వరలో ప్రకటిస్తాం"