వచ్చే ఏడాది జనవరిలో ప్రారంభమయ్యే 'ఆస్ట్రేలియన్ ఓపెన్' నగదు బహుమతిని భారీగా పెంచారు నిర్వాహకులు. గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈసారి ఏకంగా 13.6 శాతం పెరిగింది. ప్రస్తుతం 'ఆస్ట్రేలియా ఓపెన్' ప్రైజ్‌మనీ రూ.350 కోట్లకు చేరింది.
పురుషుల, మహిళల సింగిల్స్ విజేతలకు నగదు బహుమతి రూ.20 కోట్లు దక్కనుంది. తొలి రౌండ్‌లోనే నిష్క్రమించేవారికి రూ.44 లక్షలు, రెండో రౌండ్‌లో ఇంటిముఖం పట్టేవారికి రూ.63 లక్షలు ఇవ్వనున్నట్లు టోర్నీ డైరెక్టర్ క్రేగ్ టిలే తెలిపారు.
ఆస్ట్రేలియాన్ ఓపెన్ 2020
"ప్రతి ఏడాదిలా ఈ సారి నగదు బహుమతిని పెంచాం. 2007తో పోల్చుకుంటే నగదు బహుమతి 2020 సీజన్ నాటికి మూడు రెట్లు పెరిగింది. ఈ సీజన్‌లో రౌండ్ దాటే కొద్ది ప్రైజ్‌మనీ పెరుగుతూ ఉంటుంది. చాలా మంది ఆటగాళ్లు మరింత ఆదాయాన్ని ఆర్జించే అవకాశం ఉంటుంది" -క్రేగ్ టిలే, టోర్నీ డైరెక్టర్
ఆస్ట్రేలియన్ఓపెన్' ప్రైజ్‌మనీ గత పదేళ్లలో ఏకంగా 183.9 శాతం పెరిగింది. వచ్చే నెల జనవరి 20 నుంచి ఫిబ్రవరి 2 వరకు ఈ టోర్నీ జరగనుంది. గత సీజన్ పురుషుల సింగిల్స్‌లో నోవాక్ జకోవిచ్, మహిళల సింగిల్స్‌లో నవోమి ఒసాకా టైటిల్ కొట్టారు.