టెన్నిస్‌లో ఈ ఏడాది తొలి గ్రాండ్‌స్లామ్ ఆస్ట్రేలియన్ ఓపెన్‌కు రంగం సిద్ధమైంది. అత్యధిక గ్రాండ్‌స్లామ్ టైటిళ్ల వీరుడు రోజర్ ఫెదరర్ రికార్డుపై రఫెల్ నాదల్ కన్నేశాడు. అమ్మగా తొలి టైటిల్ సాధించిన సెరెనా విలియమ్స్.. రికార్డు గ్రాండ్‌స్లామ్ టైటిల్‌పై గురి పెట్టింది. మాజీ నం.1 వోజ్నియాకి ఈ టైటిల్ నెగ్గి కెరీర్‌కు ఘనంగా ముగింపు పలకాలని కోరుకుంటోంది. ఎన్నో ఆశలతో బరిలో దిగుతోన్న దిగ్గజాలకు షాకివ్వాలని జూనియర్లు కృతనిశ్చయంతో ఉన్నారు.
ఈ ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్‌కు ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. పురుషుల సింగిల్స్‌లో అత్యధిక గ్రాండ్‌స్లామ్‌లు గెలిచిన ఆటగాడిగా ఫెదరర్ రికార్డు అందుకునేందుకు నాదల్ ఒక్క టైటిల్ దూరంలో ఉన్నాడు. ఫెదరర్ ఖాతాలో 20 గ్రాండ్‌స్లామ్‌లు ఉంటే, నాదల్ 19 టైటిళ్లు సాధించాడు. ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో విజేతగా నిలిచి ఫెదరర్‌తో పాటు సమానంగా నిలవాలనే పట్టుదలతో నాదల్ ఉన్నాడు.
ఇప్పటి వరకూ తన కెరీర్‌లో ఒకేసారి 2009లో ఆస్ట్రేలియన్ ఓపెన్ గెలిచిన నాదల్.. ఈ టోర్నీలో మరోసారి సత్తా చాటాలని కోరుకుంటున్నాడు. మరోవైపు ఈ టోర్నీలో విజేతగా నిలవడం ద్వారా తన గ్రాండ్‌స్లామ్ టైటిళ్ల సంఖ్యను మరింత పెంచుకోవాలని ఫెదరర్ కోరుకుంటున్నాడు. డిఫెండింగ్ ఛాంపియన్ జకోవిచ్ నుంచి టైటిల్ వేటలో వీళ్లిద్దరికీ గట్టిపోటీ ఎదురుకానుంది.