టాప్‌సీడ్ రఫెల్ నాదల్ క్వార్టర్‌ఫైనల్ చేరుకునేందుకు తీవ్రంగా శ్రమించాడు. మ్యాచ్‌కు ముందు తనను విమర్శిస్తూ.. వెక్కిరిస్తూ అసహనానికి గురిచేసిన కిర్గియోస్‌పై అతడు కష్టపడి గెలిచాడు. సోమవారం జరిగిన ప్రిక్వార్టర్స్‌లో నాదల్... 6-3, 3-6, 7-6 (8/6), 7-6 (7/4)తో 23వ సీడ్ నిక్ కిర్గియోస్‌ను ఓడించాడు.
ఆరంభం నుంచి కిర్గియోస్ బలమైన సర్వీస్‌లతో విరుచుకుపడగా నాదల్ తిరుగులేని రిటర్న్‌లతో అతడికి బదులిచ్చాడు. నాలుగో గేమ్‌లో కిర్గియోస్ సర్వీస్‌ను బ్రేక్ చేసిన నాదల్ సులభంగానే తొలి సెట్ గెలుచుకున్నాడు. అయితే మ్యాచ్ అతడికి తేలిగ్గా ఏమీ దక్కలేదు. ప్రేక్షకుల మద్దతుతో చెలరేగిన కిర్గియోస్.. రెండో సెట్లో నాదల్ సర్వీస్‌ను బ్రేక్ చేసి 3-1 ఆధిక్యంలోకి వెళ్లాడు. అదే జోరులో అతడు సెట్ గెలుచుకుని మ్యాచ్‌ను రసవత్తరంగా మార్చాడు. నువ్వానేనా అన్నట్టుగా సాగిన తర్వాతి రెండు సెట్లు టైబ్రేకర్‌కు దారితీశాయి. అయితే కీలక సమయంలో అనవసర తప్పిదాలతో కిర్గియోస్ మూల్యం చెల్లించుకున్నాడు. టైబ్రేకర్‌లో పాయింట్లు కోల్పోయిన అతడు పలుమార్లు రాకెట్‌ను నేలకేసి కొట్టాడు. క్వార్టర్‌ఫైనల్లో నాదల్ ఐదో సీడ్ డొమినిక్ థీమ్ (ఆస్ట్రియా)ను ఢీకొననున్నాడు.