తెలంగాణ

telangana

ETV Bharat / sports

బార్టీ తర్వాతి రౌండ్​కు.. యువ సంచలనం కొకో ఇంటికి - కొకో గాప్

ఆస్ట్రేలియన్ ఓపెన్​లో టాప్ సీడ్​ ఆష్లే బార్టీ, ఫెదరర్, జకోవిచ్ తదితరులు ముందంజ వేశారు. టెన్నిస్ యువ సంచలనం కొకో గాఫ్ నాలుగో రౌండ్​లో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించింది.

బార్టీ తర్వాతి రౌండ్​కు.. యువ సంచలనం కొకో ఇంటికి
ఆస్ట్రేలియన్ ఓపెన్ 2020

By

Published : Jan 27, 2020, 7:57 AM IST

Updated : Feb 28, 2020, 2:44 AM IST

టాప్‌ సీడ్‌ ఆష్లే బార్టీ ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ క్వార్టర్‌ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఏడో సీడ్‌ క్విటోవా ముందంజ వేయగా, 15 ఏళ్ల కొకో గాఫ్‌ సంచలనాలకు నాలుగో రౌండ్లో తెరపడింది. పురుషుల సింగిల్స్‌లో తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ జకోవిచ్‌ తుది ఎనిమిదిలో అడుగుపెట్టాడు. మరో ఫేవరెట్‌ ఫెదరర్‌ నాలుగో రౌండ్‌ను అధిగమించాడు.

రోజర్ ఫెదరర్

రెండో సీడ్‌ నొవాక్‌ జకోవిచ్‌ (సెర్బియా), మూడో సీడ్‌ ఫెదరర్‌ (స్విట్జర్లాండ్‌) ఆస్ట్రేలియా ఓపెన్‌ క్వార్టర్స్‌కు చేరుకున్నారు. ఇక్కడ ఎనిమిదో టైటిల్‌పై గురిపెట్టిన జకోవిచ్‌.. నాలుగో రౌండ్లో 6-3, 6-4, 6-4తో 14వ సీడ్‌ డీగో ష్వార్జ్‌మాన్‌ (అర్జెంటీనా)ను మట్టికరిపించాడు. జకోవిచ్‌ సెమీఫైనల్లో స్థానం కోసం రోనిచ్‌ (కెనడా)తో తలపడతాడు. మరో మ్యాచ్‌లో ఫెదరర్‌ 4-6, 6-1, 6-2, 6-2తో హంగేరీకి చెందిన ఫుక్సోవిక్స్‌ను ఓడించాడు. ఫెదరర్‌ క్వార్టర్స్‌లో అమెరికాకు చెందిన సాండ్‌గ్రెన్‌ను ఢీకొంటాడు.

నొవాక్ జకోవిచ్

కొకో కథ ముగిసె:

మహిళల సింగిల్స్‌లో అమెరికా సంచలనం కొకో గాఫ్‌ కథ ముగిసింది. మూడో రౌండ్లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ నవోమి ఒసాకాకు షాకిచ్చిన ఆమె.. ప్రిక్వార్టర్స్‌లో ఓడింది. అమెరికాకే చెందిన కెనిన్‌ 6-7 (5-7), 6-3, 6-0తో గాఫ్‌ను ఇంటిముఖం పట్టించింది.
మరోవైపు టాప్‌ సీడ్‌ బార్టీ (ఆస్ట్రేలియా), ఏడో సీడ్‌ క్విటోవా (చెక్‌) క్వార్టర్స్‌కు దూసుకెళ్లారు. 1978 తర్వాత ఇక్కడ టైటిల్‌ గెలిచిన తొలి ఆస్ట్రేలియా మహిళగా నిలవాలనుకుంటున్న బార్టీ నాలుగో రౌండ్లో 6-3, 1-6, 6-4తో రిస్కె (అమెరికా)ను ఓడించింది. క్విటోవా 6-7 (4-7), 6-3, 6-2తో సకారి (గ్రీస్‌)పై విజయం సాధించింది. ఇక గ్రాండ్‌స్లామ్‌ క్వార్టర్‌ఫైనల్‌ చేరిన తొలి అరబ్‌ మహిళగా జబెర్‌ (ట్యునీషియా) రికార్డు సృష్టించింది.

టాప్ సీడ్​ ఆష్లే బార్టీ

మిక్స్‌డ్‌ రెండో రౌండ్లో పేస్‌ జోడీ

లియాండర్‌ పేస్‌, ఒస్తాపెంకో (లాత్వియా) జంట.. మిక్స్‌డ్‌ డబుల్స్‌లో శుభారంభం చేసింది. తొలి రౌండ్లో ఈ ద్వయం 6-7 (4-7), 6-3, 10-6తో స్టామ్‌ సాండర్స్‌-మార్క్‌ పొల్మాన్స్‌ (ఆస్ట్రేలియా) జోడీపై విజయం సాధించింది. బోపన్న, కిచెనోవ్‌ (ఉక్రెయిన్‌) జోడీ కూడా తర్వాతి రౌండ్‌కు చేరుకుంది.

Last Updated : Feb 28, 2020, 2:44 AM IST

ABOUT THE AUTHOR

...view details