వింబుల్డన్‌లో(Wimbledon) మహిళల సింగిల్స్ ఆఖరి అంకానికి చేరుకుంది. టాప్ సీడ్ ఆష్లే బార్టీ (ఆస్ట్రేలియా), ఎనిమిదో సీడ్ ప్లిస్కోవా (చెక్) సెమీస్‌లో గెలిచి ఫైనల్‌కు దూసుకెళ్లారు. బార్టీ(Ashleigh Barty) సెమీఫైనల్లో 6-3, 7-6 (7-3)తో మాజీ ఛాంపియన్ కెర్బర్ (జర్మనీ)పై విజయం సాధించింది.
మ్యాచ్‌ను ఘనంగా ఆరంభించిన బార్టీ.. 3-0 ఆధిక్యంలోకి వెళ్లింది. ఆమె కెర్బర్ తొలి సర్వీసునే బ్రేక్ చేసింది. ఆధిపత్యాన్ని కొనసాగించిన బార్టీ.. 34 నిమిషాల్లోనే తొలి సెట్‌ను చేజిక్కించుకుంది. అయితే కెర్బర్ పుంజుకుని, గట్టిగా ప్రతిఘటించడం వల్ల రెండో సెట్ హోరాహోరీగా సాగింది. ఆరంభంలోనే బ్రేక్ సాధించిన కెర్బర్ ఓ దశలో 4-1తో నిలవడం వల్ల సెట్ చేజిక్కించుకునేలా కనిపించింది. కానీ పుంజుకున్న బార్టీ సెట్‌ను టేబ్రేక్‌కు తీసుకెళ్లింది. టైబ్రేక్‌లో పైచేయి సాధించి సెట్, మ్యాచ్‌ను గెలుచుకుంది.
మ్యాచ్‌లో బార్టీ 8 ఏస్‌లు, 38 విన్నర్లు కొట్టింది. కెర్బర్ 23 అనవసర తప్పిదాలు చేసింది. బార్టీ వింబుల్డన్ ఫైనల్ చేరడం ఇదే తొలిసారి. తొలి గ్రాండ్‌స్లామ్ టైటిల్ కోసం ఆరాటపడుతున్న ప్లిస్కోవాకు(Karolína Plíšková) కూడా ఇదే మొదటి వింబుల్డన్ ఫైనల్. మొత్తంగా రెండో గ్రాండ్‌స్లామ్ ఫైనల్. సెమీస్‌లో ఆమె 5-7, 6-4, 6-4తో రెండో సీడ్ సబలెంక (బెలారస్)ను ఓడించింది. తొలి సెట్లో ఓడిన తర్వాత ప్లిస్కోవా అద్భుతంగా పుంజుకుంది. పదునైన సర్వీసులు చేసిన ప్లిస్కోవా మ్యాచ్‌లో 14 ఏస్‌లు సంధించింది. సబలెంక 18 ఏస్‌లు కొట్టింది. కానీ రెండో సర్వ్‌లో ఎక్కువ పాయింట్లు రాబట్టలేకపోయింది. మహిళల ఫైనల్ శనివారం జరుగుతుంది. శుక్రవారం జరిగే పురుషుల సింగిల్స్ సెమీఫైనల్స్‌లో షపొవలోవ్‌తో(Denis Shapovalov) జకోవిచ్(Novak Djokovic), హర్కజ్‌తో బెరెటిని(Matteo Berrettini) తలపడతారు.
ఇదీ చూడండి..wimbledon: సెమీస్‌కు జకోవిచ్.. ఫెదరర్, మీర్జా-బోపన్న ఇంటికి