గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నీ సింగిల్స్‌లో భారత క్రీడాకారిణి పోటీపడి ఎనిమిదేళ్లయ్యింది. చివరగా 2012లో సానియా మీర్జా బరిలో దిగింది. ఆ తర్వాత ఇప్పటివరకు ఎవరికీ ఆ అవకాశం దక్కలేదు. ఆ ఘనత సాధించేందుకు ఆరోసారి ప్రయత్నం చేస్తున్న భారత టెన్నిస్ ప్లేయర్ అంకిత రైనా ఆస్ట్రేలియన్ ఓపెన్ క్వాలిఫయర్స్‌లో ఫైనల్ రౌండ్‌కు దూసుకెళ్లింది. ఇంకో మ్యాచ్ గెలిస్తే చాలు ఆమె ప్రధాన డ్రాకు అర్హత పొందుతుంది.
మంగళవారం జరిగిన రెండో రౌండ్లో 180వ ర్యాంకర్ అంకిత 6-2, 2-6, 6-3తో 118వ ర్యాంకర్ కేథరీనా జవస్కా (ఉక్రెయిన్)కు షాకిచ్చింది. ఫైనల్లో ఆమె 183వ ర్యాంక్‌లో ఉన్న ఓల్గా డానిలోవిచ్ (సెర్బియా)ను ఢీకొంటుంది. ఇప్పటివరకు భారత్ నుంచి నిరుపమ వైద్యనాథన్, సానియా మీర్జా మాత్రమే గ్రాండ్‌స్లామ్ టోర్నీ సింగిల్స్ విభాగంలో పోటీపడ్డారు.