ఫ్రెంచ్ ఓపెన్(French Open)లో అనస్తాసియా పవ్లించెంకోవా(pavlyuchenkova) టైటిల్‌కు అడుగు దూరంలో నిలిచింది. రొలాండ్ గారోస్‌లో ఈ రష్యా స్టార్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో 31వ సీడ్ పవ్లిచెంకోవా 7-5, 6-3తో స్లొవేనియా కెరటం టమారా జిదాన్‌సెక్(Tamara Zidanšek)ను ఓడించింది. ఈ మ్యాచ్‌లో తొలి సెట్లో మాత్రమే ప్రత్యర్థి నుంచి పవ్లిచెంకోవాకు పోటీ ఎదురైంది.
తొలి సెట్లో 2-0 ఆధిక్యంలో నిలిచిన జిదాన్‌సెక్ ప్రత్యర్థిని ఒత్తిడిలో నెట్టింది. కానీ వెంటనే పుంజుకున్న పవ్లించెకోవా.. 2-2తో స్కోరు సమం చేసింది. అక్కడ నుంచి ఇద్దరూ తగ్గకపోవడం వల్ల సెట్ టైబ్రేకర్ వెళ్తుందేమో అనిపించింది. కానీ పన్నెండో గేమ్‌లో ప్రత్యర్థి సర్వీస్ బ్రేక్ చేసిన పవ్లిచెంకోవా.. సెట్‌ను చేజిక్కించుకుంది. తొలి సెట్ దక్కిన ఉత్సాహంతో మరింత దూకుడుగా ఆడిన ఆమె.. రెండో సెట్లో ఆరంభంలోనే జిదాన్‌సెక్ సర్వీస్ బ్రేక్ చేసింది. ఆ తర్వాత 4-1తో తిరుగులేని ఆధిక్యంలో నిలిచింది. అదే జోరు ప్రదర్శించి 6-3తో సెట్‌తో పాటు మ్యాచ్‌ను దక్కించుకుంది.
తొలిసారి ఫైనల్లో..
50 అంతకంటే ఎక్కువ గ్రాండ్‌స్లామ్‌లు ఆడిన తర్వాత మొదటిసారి ఫైనల్(French Open final 2021)కు చేరిన తొలి క్రీడాకారిణిగా 29 ఏళ్ల పవ్లిచెంకోవా రికార్డు సృష్టించింది. ఆమెకిది 52వ గ్రాండ్‌స్లామ్. తొలిసారి 2007లో గ్రాండ్‌స్లామ్ టోర్నీ (వింబుల్డన్)లో బరిలోకి దిగింది. పవ్లిచెంకోవా టైటిల్ కోసం బార్బరా క్రెజికోవా(Barbora Krejčíkov) (చెక్)తో తలపడుతుంది. మూడు గంటలకుపైగా హోరాహోరీగా సాగిన మరో సెమీఫైనల్లో క్రెజికోవా 7-5, 4-6, 9-7తో సకారి (గ్రీస్)ను ఓడించింది. ఈ మ్యాచ్‌లో అయిదు ఏస్‌లు కొట్టిన క్రెజికోవా.. ఏడుసార్లు ప్రత్యర్థి సర్వీసును బ్రేక్ చేసింది. క్రెజికోవాకు ఇదే తొలి గ్రాండ్‌స్లామ్ ఫైనల్.
రఫా x జకో
ఫ్రెంచ్ ఓపెన్‌లో ఫైనల్‌కు ముందే ఫైనల్! శుక్రవారం జరిగే పురుషుల సింగిల్స్ సెమీఫైనల్లో(French Open semis) డిఫెండింగ్ ఛాంపియన్ రఫెల్ నాదల్(Rafael Nadal) (స్పెయిన్)తో అమీతుమీ తేల్చుకునేందుకు టాప్‌సీడ్ నొవాక్ జకోవిచ్(novak djokovic) (సెర్బియా) సిద్ధమయ్యాడు. క్వార్టర్‌ఫైనల్లో తొమ్మిదో సీడ్ బెరిటిని(Berrettini) (ఇటలీ)పై 6-3, 6-2, 6-7 (5/7), 7-5తో విజయాన్ని అందుకున్న జకో.. రఫాతో సమరానికి సై అంటున్నాడు. అయితే బెరిటినిపై జకో అంత సులభంగా ఏమీ గెలవలేదు. తొలి రెండు సెట్లు పెద్దగా కష్టపడకుండానే నెగ్గిన నొవాక్‌కు.. మూడు, నాలుగు సెట్లలో బెరిటిని గట్టిపోటీ ఇచ్చాడు. బలమైన ఫోర్ హ్యాండ్ షాట్లు, క్రాస్‌కోర్టు విన్నర్లతో విజృంభించిన ఈ ఇటలీ ఆటగాడు టైబ్రేకర్‌లో ఈ సెట్‌ను గెలుచుకున్నాడు. నాలుగో సెట్లోనూ బెరిటిని తగ్గకపోవడం వల్ల నొవాక్ ప్రతి పాయింటుకూ చెమటోడ్చాల్సి వచ్చింది. కానీ 12వ గేమ్‌లో బ్రేక్ సాధించిన జకో.. సెట్‌తో పాటు మ్యాచ్ గెలిచి ముందంజ వేశాడు. ఈ పోరులో జకో 12 ఏస్‌లు కొట్టగా.. బెరిటిని 11 సంధించాడు. కానీ నాలుగుసార్లు సర్వీస్ కోల్పోయిన బెరిటిని.. 51 అనవసర తప్పిదాలు చేసి ఓటమి కొనితెచ్చుకున్నాడు.
ఇక ఫైనల్‌లో స్థానం దక్కించుకోవాలంటే జకో పెద్ద అడ్డంకినే అధిగమించాలి. సెమీస్‌లో అతడు 13సార్లు ఛాంపియన్ నాదల్‌ను ఢీకొంటాడు. రికార్డు పరంగా చూస్తే.. క్లే కోర్టుల్లో నొవాక్‌పై రఫాదే ఆధిపత్యం. మట్టి కోర్టుల్లో ఇప్పటివరకు ఈ ఇద్దరు 26సార్లు తలపడగా.. అందులో నాదల్ 19 సార్లు పైచేయి సాధించాడు. రొలాండ్ గారోస్‌లో ఇద్దరూ ఎనిమిదిసార్లు ఆడితే.. నాదల్ (7) తిరుగులేని ఆధిక్యంలో ఉన్నాడు. మొత్తంగా చూస్తే జకో 29-28తో రఫాపై ఒక్క విజయంతో పైచేయిలో ఉన్నాడు. గాండ్‌స్లామ్ టోర్నీల్లో ఇద్దరూ 16 సార్లు ఎదురుపడగా.. నొవాక్ (6)పై నాదల్ (10) ముందంజలో ఉన్నాడు.
సాలిస్‌బరి జోడీకి టైటిల్..
జో సాలిస్‌బరి(Joe Salisbury) (ఇంగ్లాండ్)-క్రాజ్‌యాక్ (అమెరికా) జోడీ మిక్స్‌డ్ డబుల్స్ టైటిల్ గెలుచుకుంది. ఫైనల్లో సాలిస్‌బరి-క్రాజ్‌యాక్ జంట 2-6, 6-4, 10-5తో అస్లాన్ కరాత్సెవ్-ఎలీనా వెస్నీనా (రష్యా)పై కష్టపడి గెలిచింది.
ఇదీ చూడండి..ఛాంపియన్ ఇంటికి.. నాదల్ దూకుడు