మాజీ ప్రేయసి ఓల్గా షరిపోవా (రష్యా) చేసిన గృహ హింస ఆరోపణల్ని జర్మనీ టెన్నిస్ ఆటగాడు అలెగ్జాండర్ జ్వెరెవ్ కొట్టిపారేశాడు. ఆ ఆరోపణల్లో నిజం లేదని తెలిపాడు. 2019లో యూఎస్ ఓపెన్‌కు ముందు న్యూయార్క్ హోటల్‌లో జ్వెరెవ్ దిండుతో గొంతు నులిమాడని.. తలను గోడకు బాదాడని ఓల్గా ఆరోపించింది. దీనిపై అలగ్జాండర్ జ్వెరెవ్ స్పందించాడు.
నాపై వస్తోన్న ఆరోపణల్లో నిజం లేదు: జ్వెరెవ్ - అలెగ్జాండర్ జ్వెరెవ్
టెన్నిస్ ప్లేయర్ అలెగ్జాండర్ జ్వెరెవ్ తనను హింసించాడని.. మాజీ ప్రేయసి ఓల్గా షరిపోవా చేసిన ఆరోపణల్ని సదరు ఆటగాడు ఖండించాడు. ఆ ఆరోపణల్లో నిజం లేదని.. ఇలాంటి ప్రకటనలు ఆమె చేసినందుకు చింతిస్తున్నట్లు తెలిపాడు.
ఆమె అలాంటి ప్రకటనలు చేసినందుకు చింతిస్తున్నా. ఆ ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదు. మా మధ్య ఒకప్పుడు సంబంధం ఉండేది. కానీ చాలాకాలం క్రితమే ముగిసింది. ఇప్పుడు ఓల్గా ఎందుకు ఆరోపణలు చేస్తుందో నాకు అర్థం కావడం లేదు. మేం ఒకరి పట్ల మరొకరం సహేతుకంగా.. గౌరవప్రదంగా వ్యవహరించడానికి మార్గం కనుగొంటామని ఆశిస్తున్నా’’ అని జ్వెరెవ్ పేర్కొన్నాడు.
జ్వెరెవ్ మరో మాజీ ప్రేయసి బ్రెండా.. తాను అతడి వల్ల గర్భవతినయ్యానని ఇటీవల వెల్లడించడం సంచలనం రేపింది. ఈ వ్యాఖ్యలపై జ్వెరెవ్ ఇంకా స్పందించలేదు.