లాక్‌డౌన్ కారణంగా దొరికిన ఖాళీలో చాలా సమయం తన కొడుకు ఇజాన్‌కే కేటాయిస్తున్నట్లు టెన్నిస్ స్టార్ సానియా మీర్జా తెలిపింది. అయితే ఈ సమయంలో తన భర్త షోయబ్ మాలిక్ తమకు దూరంగా ఉండటం దురదృష్టకరమని ఆమె అంది. కరోనా వైరస్, లాక్‌డౌన్ వల్ల టెన్నిస్ సహా వివిధ క్రీడలపై పడ్డ ప్రభావం.. తన దైనందిన జీవితంలో వచ్చిన మార్పులు.. కొడుకు ఇజాన్‌తో కాలక్షేపం.. భర్త షోయబ్ మాలిక్‌తో ఎడబాటు.. ఇలా అనేక అంశాలపై ముచ్చటించింది సానియా. ఆ విశేషాలు ఆమె మాటల్లోనే..
సంబరాలు లేవు
ఫెడ్ కప్ హార్ట్ పురస్కారం అందుకున్న తొలి భారత ప్లేయర్‌గా నిలవడం చాలా సంతృప్తిగా ఉంది. దేశం కోసం ఆడటాన్ని ఎంతగానో ఆస్వాదిస్తాను. అందుకోసం సర్వశక్తులూ ఒడ్డుతాను. ఈ విషయంలో నా తపనకు దక్కిన అధికారిక గుర్తింపుగా ఈ అవార్డును భావిస్తున్నా. ఇది గొప్ప ఘనతే అయినప్పటికీ.. కరోనా మహమ్మారి కారణంగా సంబరాలు చేసుకోవడానికే అవకాశం లేకపోయింది.
వాళ్లను చూస్తే..
ప్రపంచమంతా కష్ట కాలాన్ని ఎదుర్కొంటోంది. మన దేశంలో ఎంతోమంది సామాన్యులు అవస్థలు పడుతున్నారు. వారి కోసం నా వంతుగా చిరు సాయం చేస్తున్నా. వలస కూలీలకు సంబంధించిన వీడియోలు చూస్తే గుండె తరుక్కుపోతుంది. వాళ్లలా ఉంటే మనం సౌకర్యవంతంగా ఉన్నామే అన్న అపరాధ భావం తొలిచేసింది. వారి కోసం విరాళాలు సేకరించి సాయపడే ప్రయత్నం చేస్తున్నాం. కానీ మనది చాలా పెద్ద దేశం. ఎంత చేసినా సరిపోదు.
ఇది మంచి మార్పు
ప్రశాంతంగా ఇంట్లో కూర్చుని సమయాన్ని ఆస్వాదించే అవకాశం వచ్చింది. నాకు ఇలాంటి అవకాశం అరుదుగా వస్తుంది. ఎన్నో ఏళ్లుగా ప్రయాణాలు, టోర్నీలతో తీరిక లేకుండా గడుపుతున్నా. రంజాన్ మాసం కావడం వల్ల తెల్లవారుజామున మూడున్నరకే నిద్ర లేచి సెహ్రి ముగించుకుని, ప్రార్థన చేసి మళ్లీ పడుకుంటున్నా. కొంచెం ఆలస్యంగా నిద్ర లేస్తున్నా. ఆపై ఖురాన్ చదివి, ప్రార్థన చేసుకుంటా. ఉపవాసం విరమించడానికి ముందు రెండు గంటల పాటు వ్యాయామం చేస్తున్నా. ఇక రోజులో ఎక్కువ సమయం నా కొడుకు ఇజాన్‌తోనే సరిపోతోంది. అర్ధరాత్రి దాకా వాడు నిద్రపోనివ్వట్లేదు. లాక్‌డౌన్ సమయంలో ఏదీ క్రమ పద్ధతిలో అయితే నడవట్లేదు. అయితే ఫిట్‌నెస్ విషయంలో ఎంతమాత్రం అశ్రద్ధ చూపట్లేదు. అదృష్టవశాత్తూ మా ఇంటి ఆవరణలో కొంత ఖాళీ ప్రదేశం ఉంది. అక్కడే సాధన చేస్తున్నా.
అకాడమీ ఆ తర్వాతే..
ప్రపంచవ్యాప్తంగా అన్ని వర్గాల వారి మీదా వైరస్ ప్రభావం చూపిస్తోంది. క్రీడలు అందుకు మినహాయింపు కాదు. అన్ని అంతర్జాతీయ టోర్నీలూ ఆగిపోయాయి. మళ్లీ ఆటలు ఎప్పుడు మొదలవుతాయో తెలియదు. కరోనా ముప్పును దృష్టిలో ఉంచుకుని ఆటల్లో ఏం మార్పులు చేస్తారో అర్థం కావట్లేదు. వైరస్ ముప్పు పూర్తిగా తొలగిపోయాకే మళ్లీ ఆటలు మొదలుపెట్టాలి. నా అకాడమీనీ ఆ తర్వాతే పునఃప్రారంభిస్తా. వైరస్ ఉండగా ప్రయాణాలు చేస్తే ప్రమాదాన్ని కొనితెచ్చుకున్నట్లే.
షోయబ్ ఉంటే బాగుండేది
షోయబ్ మాతో ఉంటే బాగుండేది. పాకిస్థాన్ సూపర్ లీగ్ కోసం వెళ్లిన షోయబ్ పాకిస్థాన్‌లోనే ఉండిపోయాడు. ఇజాన్ మళ్లీ తన తండ్రిని ఎప్పుడు చూస్తాడో తెలియట్లేదు. వీడియో కాల్స్ ద్వారా ఎంతసేపు మాట్లాడినా.. నేరుగా కలిసిన అనుభూతికి సాటి రాదు. లాక్‌డౌన్ ముగిసే సమయానికి మేమందరం ఆరోగ్యంగా, సంతోషంగా బయటపడతామని ఆశిస్తున్నా. మళ్లీ ఏ భయం లేకుండా కరచాలనాలు చేసే రోజులు రావాలని కోరుకుంటున్నా.
- కొత్తగా కుటుంబ సభ్యులతో కలిసి టేబుల్ టెన్నిస్ ఆడుతున్నా. ఆ ఆటపై కొంత పట్టు సాధించా.
- కొన్ని రోజులుగా 'ఎర్టుగ్రుల్' అనే టర్కీ సీరియల్‌ను చూస్తున్నా. చాలా బాగుంది.
- టెన్నిస్‌ను పక్కన పెడితే.. ఈ సమయంలో భర్త, స్నేహితులు లేకపోవడం లోటే. టీవీలో ఆట లైవ్ చూడలేకపోవడం, బయటికెళ్లి తినలేకపోవడం పట్ల బాధగా ఉంది.
ఇదీ చూడండి..'ఛాంపియన్లు ఎప్పుడూ గొప్ప నిర్ణయాలే తీసుకుంటారు'