తెలంగాణ

telangana

ETV Bharat / sports

యుఎస్‌ ఓపెన్‌ : ముర్రే కథ ముగిసె.. అజరెంకా ముందంజ

యుఎస్‌ ఓపెన్‌లో మహిళల సింగిల్స్‌లో ఇప్పటికే టాప్‌ సీడ్‌ ప్లిస్కోవా, పదో సీడ్‌ ముగురుజా ఇంటి దారి పట్టగా.. తాజాగా ఐదో సీడ్‌ సబలెంకా, తొమ్మిదో సీడ్‌ కొంటా కూడా ఓటమి పాలయ్యారు. పురుషుల సింగిల్స్‌లో మాజీ నంబర్‌వన్‌ ఆండీ ముర్రే, 14వ సీడ్‌ దిమిత్రోవ్‌ కథ ముగిసింది. మరోవైపు సెరెనా విలియమ్స్‌, థీమ్‌ మూడో రౌండ్లో అడుగుపెట్టారు.

Andy Murray, Victoria Azarenka
ముర్రే

By

Published : Sep 5, 2020, 6:42 AM IST

మహిళల సింగిల్స్‌లో సీడెడ్‌ క్రీడాకారిణులు వరుసగా ఇంటి ముఖం పడుతున్నారు. రెండో రౌండ్లో సబలెంకా (బెలారస్‌)కు అదే దేశానికి చెందిన మాజీ నంబర్‌వన్‌ అజరెంకా చెక్‌ పెట్టింది. పూర్తి ఏకపక్షంగా సాగిన పోరులో ఆమె 6-1, 6-3 తేడాతో సబలెంకాను చిత్తుచేసింది. మ్యాచ్‌లో ఆమె ఒక ఏస్‌తో పాటు 11 విన్నర్లు కొట్టింది. మరో మ్యాచ్‌లో అన్‌సీడెడ్‌ క్రిస్టీ (రొమేనియా) 2-6, 7-6 (7/5), 6-4తో కొంటా (యూకే)పై గెలిచింది. మరోవైపు సొంతగడ్డపై జరుగుతున్న టోర్నీలో టైటిల్‌ ఫేవరేట్‌గా బరిలో దిగిన మూడో సీడ్‌ సెరెనా విలియమ్స్‌ 6-2, 6-4తో మార్గరిటా (రష్యా)పై నెగ్గింది. యుఎస్‌ ఓపెన్‌ చరిత్రలో ఆమెకిది 103వ విజయం. రెండో సీడ్‌ కెనిన్‌, ఏడో సీడ్‌ కీస్‌ (యుఎస్‌ఏ) కూడా ముందంజ వేశారు. కెనిన్‌ 6-4, 6-3తో ఫెర్నాండెజ్‌ (కెనడా)పై, కీస్‌ 6-2, 6-1తో బోల్సోవా (స్పెయిన్‌)పై గెలిచారు. అనిసిమోవా, స్టీఫెన్స్‌ (యుఎస్‌ఏ), మార్టిన్స్‌ (బెల్జియం) రెండో రౌండ్‌ దాటారు.

కెర్బర్‌ జోరు: మాజీ నంబర్‌వన్‌ కెర్బర్‌ (జర్మనీ) ప్రిక్వార్టర్‌ ఫైనల్‌కు దూసుకెళ్లింది. మూడో రౌండ్లో ఆమె 6-3, 6-4తో ఆన్‌ లి (అమెరికా)పై విజయం సాధించింది. ఎనిమిదో సీడ్‌ మార్టిచ్‌ (క్రొయేషియా) కూడా నాలుగో రౌండ్‌కు చేరుకుంది. మూడో రౌండ్లో ఆమె 6-3, 6-3తో గ్రెచేవా (రష్యా)ను ఓడించింది. పుతినెత్సెవా (కజకిస్థాన్‌) 3-6, 6-2, 6-1తో సస్నోవిచ్‌ (బెలారస్‌)పై నెగ్గింది.

ముగిసిన పోరాటం: పురుషుల సింగిల్స్‌లో ముర్రే (బ్రిటన్‌) పోరు ముగిసింది. శస్త్రచికిత్సల కారణంగా 20 నెలల సుదీర్ఘ విరామం తర్వాత ఆడుతున్న తొలి గ్రాండ్‌స్లామ్‌ టోర్నీలో రెండో రౌండ్లోనే నిష్క్రమించాడు. మొదటి మ్యాచ్‌లో నాలుగున్నర గంటలకు పైగా విజయం కోసం పోరాడి అలిసిపోయిన అతను రెండో రౌండ్లో స్థాయికి తగ్గ ఆటతీరు ప్రదర్శించలేకపోయాడు. అతను 2-6, 3-6, 4-6తో ఫెలిక్స్‌ అగర్‌ (కెనడా) చేతిలో ఓడిపోయాడు. మరో మ్యాచ్‌లో దిమిత్రోవ్‌ (బల్గేరియా) 7-6 (7/5), 6-7 (4/7), 6-3, 4-6, 1-6తో ఫక్సోవిక్స్‌ (హంగేరి) చేతిలో పోరాడి ఓడాడు. మూడో సీడ్‌ మెద్వెదెవ్‌ (రష్యా), ఆరో సీడ్‌ బెరెట్టిని (ఇటలీ), ఎనిమిదో సీడ్‌ బటిస్టా (స్పెయిన్‌), పదో సీడ్‌ రుబ్లెవ్‌ (రష్యా)లు మూడో రౌండ్లో అడుగుపెట్టారు. మెద్వెదెవ్‌, బెరెట్టిని, బటిస్టా, రుబ్లెవ్‌, కచనోవ్‌ (రష్యా) కూడా మూడో రౌండ్‌ చేరారు.

ముర్రే అజరెంకా

నగాల్‌ నిష్క్రమణ

ఏడేళ్ల తర్వాత ఓ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీలో రెండో రౌండ్‌ చేరిన భారత సింగిల్స్‌ ఆటగాడిగా నిలిచిన సుమిత్‌ నగాల్‌ పోరాటం యుఎస్‌ ఓపెన్‌లో ముగిసింది. రెండో రౌండ్లో నగాల్‌ 3-6, 3-6, 2-6 తేడాతో రెండో సీడ్‌ థీమ్‌ (ఆస్ట్రియా) చేతిలో ఓడాడు. ప్రపంచ మూడో ర్యాంకర్‌ థీమ్‌ను 124వ ర్యాంకులో ఉన్న నగాల్‌ నిలువరించలేకపోయాడు. ‘‘2020 యుఎస్‌ ఓపెన్‌కు ధన్యవాదాలు. నేర్చుకోవడానికి ఎంతో ఉంది. మరింత కష్డపడేందుకు సిద్ధమవుతున్నా’’ అని మ్యాచ్‌ అనంతరం నగాల్‌ ట్వీట్‌ చేశాడు. ‘‘నగాల్‌ ఆటకు సంబంధించిన వీడియోలు చూశా. అతను ఫోర్‌హ్యాండ్‌ షాట్లను బాగా ఆడాడు. అందుకే మ్యాచ్‌లో ఆ షాట్లు ఆడే అవకాశం ఇవ్వలేదు’’ అని థీమ్‌ పేర్కొన్నాడు.

నగాల్

ఇదీ చూడండి 'చారిత్రక విజయంలో భాగమవ్వడం గొప్ప అనుభూతి '

ABOUT THE AUTHOR

...view details