టీ20 ప్రపంచకప్ (T20 World Cup 2021) సెమీ ఫైనల్లో ఇంగ్లాండ్‌పై (New Zealand vs England) గెలిచిన అనంతరం ఎలాంటి సంబరాలు చేసుకోలేదు (Neesham Reaction) న్యూజిలాండ్ ఆల్‌రౌండర్ జిమ్మీ నీషమ్. దీనిపై సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా చర్చ జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో 11 బంతుల్లోనే 27 పరుగులు చేసి జట్టు ఫైనల్ చేరడంలో కీలక పాత్ర పోషించాడు నీషమ్. అయితే అతడు సెలబ్రేట్ చేసుకోకపోవడానికి ఓ కారణం ఉంది.
2019 వన్డే ప్రపంచకప్ (2019 World Cup) ఉత్కంఠభరిత ఫైనల్లో బౌండరీ కౌంట్ నిబంధన ఆధారంగా కివీస్‌పై ఇంగ్లాండ్ గెలిచింది. కివీస్ క్రికెటర్లు అంతులేని గుండెకోతను అనుభవించారు. ఈ నేపథ్యంలోనే అప్పుడే సంబురాలు (Neesham Celebration) చేసుకోకూడదని నీషమ్ భావించి ఉండొచ్చు.
"(టీ20 వరల్డ్‌కప్) సెమీ ఫైనల్ గెలవడం.. వేడుక చేసుకోవాల్సిన సందర్భమే. అయితే సెమీస్ గెలవడానికి మాత్రమే సగం ప్రపంచాన్ని దాటుకొని రాము కదా! ఆదివారం జరగబోయే మ్యాచ్‌పై దృష్టి పెట్టాం. ఒకసారి ఒక గేమ్ గురించే ఆలోచిస్తున్నాం. ఆ ఒక్కటి గెలిస్తే.. మా అనుభూతి మరో స్థాయిలో ఉంటుంది."
- జిమ్మీ నీషమ్, న్యూజిలాండ్ ఆల్‌రౌండర్
టీ20 ప్రపంచకప్‌లో (T20 World Cup 2021) ఫైనల్లో ఆదివారం ఆస్ట్రేలియాతో (NZ vs Aus) తలపడనుంది కివీస్. ఇరు జట్లూ ఇప్పటివరకు ఈ టైటిల్ గెలవలేదు. ప్రపంచ క్రికెట్లో చాలా నిలకడగా రాణిస్తున్న జట్లలో న్యూజిలాండ్ ఒకటి. ప్రత్యేకించి ఐసీసీ ఈవెంట్లలో ఆ జట్టు అద్భతుంగా ఆడుతోంది. అయితే తమ ప్రణాళిక, క్రికెటర్ల నిబద్ధతే ఇందుకు కారణమని అన్నాడు నీషమ్.
సన్నీ కితాబు..
టీ20 ప్రపంచకప్‌లో (T20 World Cup) న్యూజిలాండ్ జట్టు సమష్టిగా రాణిస్తూ ముందుకు సాగుతోందని, కెప్టెన్ కేన్ విలియమ్సన్ సమర్థ నాయకత్వం వల్లే కివీస్ గొప్ప విజయాలు సాధిస్తోందని దిగ్గజ క్రికెటర్ సునీల్ గావస్కర్ అన్నాడు. 'కివీస్ ఆటగాళ్లంతా.. వారి ప్రదర్శనపై చాలా నమ్మకంతో ఉన్నారు. చాలా చిన్న దేశం నుంచి వచ్చినా.. వారంతా సమష్టిగా రాణిస్తూ గొప్ప విజయాలను అందుకొన్నారు. బుధవారం జరిగిన తొలి సెమీస్ మ్యాచ్‌లో.. ఆరంభంలోనే రెండు కీలక వికెట్లు కోల్పోయినా బ్యాటర్లు ఏమాత్రం నిరాశ చెందలేదు. నిలకడగా ఆడుతూ కెప్టెన్ ఆశల్ని నిలబెట్టారు. కెప్టెన్ విలియమ్సన్ జట్టులోని ప్రతి ఆటగాడిని గౌరవిస్తాడు.' అని సునీల్ గావస్కర్ చెప్పాడు. వారిపై ఎలాంటి ఒత్తిడి లేకుండా పరిస్థితులకు తగ్గట్టుగా మలుచుకుంటాడని.. అందుకే న్యూజిలాండ్ ఇంకా ఒక ఓవర్ మిగిలి ఉండగానే అలవోకగా విజయం సాధించిందని పేర్కొన్నాడు. విలియమ్సన్ వంటి గొప్ప నాయకుడి చేతిలో జట్టు పగ్గాలుండటం వల్లే ఇది సాధ్యమయిందిని.. అందుకే, ప్రస్తుత క్రికెటర్లలో అతనో లెజెండ్ అని గావస్కర్ వ్యాఖ్యానించాడు.
జిమ్మీ నీషమ్‌పై కూడా సునీల్ గావస్కర్ ప్రశంసల వర్షం కురిపించాడు. జట్టు క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న సమయంలో బ్యాటింగ్‌కి వచ్చిన అతడు ఒంటి చేత్తో మ్యాచ్ ఫలితాన్నే మార్చేశాడని అభినందించాడు. 'నీషమ్.. ఇంగ్లాండ్‌పై గొప్ప ఇన్నింగ్స్ ఆడాడు. 240కి పైగా స్ట్రైక్ రేట్‌తో బ్యాటింగ్ చేయడం సాధారణ విషయం కాదు. అతడి వీర బాదుడుకుతోడు కొంచెం అదృష్టం కూడా కలిసొచ్చింది. అన్నింటికన్నా కెప్టెన్ విలియమ్సన్‌కి అతడిపై నమ్మకమెక్కువ. అందుకే విధ్వంసకర బ్యాటర్లున్న ఇంగ్లాండ్ లాంటి జట్టుపై అతడితో చివరి ఓవర్ బౌలింగ్ చేయించాడు. ఏదేమైనా అతడు తన టాలెంట్‌కి న్యాయం చేశాడనిపిస్తోంది' అని గావస్కర్ పేర్కొన్నాడు.
ఇదీ చూడండి:Kohli captaincy: 'వన్డే, టెస్టుల్లోనూ కోహ్లీ కెప్టెన్సీ వదులుకుంటాడు!'