యూఏఈ వేదికగా జరిగిన టీ20 ప్రపంచకప్‌లో సెమీ ఫైనల్ చేరకుండానే ఇంటిముఖం పట్టి అభిమానుల్ని నిరాశకు గురిచేసింది టీమ్ఇండియా. పాకిస్థాన్, న్యూజిలాండ్ జట్లతో జరిగిన మ్యాచ్‌ల్లో అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్‌లో విఫలమైంది. దీనిపై స్పందించిన మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్.. వచ్చే ఏడాది ఆస్ట్రేలియాలో జరగబోయే పొట్టి ప్రపంచకప్‌నకు ముందు భారత జట్టు కొన్ని విషయాలపై దృష్టి సారించాలని తెలిపాడు.
"ఆస్ట్రేలియా పిచ్ పరిస్థితుల్లో రాణించగల ఇద్దరు పేసర్లను ముందుగానే గుర్తించాలి. అక్కడి పిచ్‌లు స్వింగ్, పేస్‌కు అనుకూలిస్తాయి. అందువల్ల బౌలర్లు వేగంగా స్వింగ్, పేస్ రాబట్టగలగాలి. అలాగే బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్ చేయగల మెరుగైన ఆల్రౌండర్లను జట్టులోకి తీసుకోవాలి."