టీ20 ప్రపంచకప్‌లో (T20 Worldcup) పాకిస్థాన్ (Pakistan) రెండో విజయాన్ని నమోదు చేసింది. సమష్టి కృషితో న్యూజిలాండ్‌పై (Newzealand) అద్భుత విజయం సాధించింది. టీమ్ఇండియా, కివీస్, అఫ్గాన్‌పై వరుస విజయాలతో పాక్ (6 పాయింట్లు) సెమీస్‌కు వెళ్లేందుకు మార్గం సుగమమైంది. ఇక పాక్ ఢీకొట్టేబోయేది స్కాట్లాండ్, నమీబియా వంటి చిన్న జట్లనే. ఇప్పుడు ఈ గ్రూప్ నుంచి సెమీస్‌కు వెళ్లే రెండో జట్టు ఏదనేదే ప్రశ్న. గ్రూప్‌లో టీమ్ఇండియాతో (Team India) పాటు కివీస్, అఫ్గాన్‌కు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అయితే స్కాట్లాండ్ మీద భారీ విజయంతో అఫ్గాన్ ఒక అడుగు ముందే ఉందని చెప్పొచ్చు. మంగళవారం పాక్ మీద కివీస్ ఓడిపోవడం భారత్, అఫ్గాన్‌కు కలిసొచ్చే అంశం.
గతం మరిచి.. విజయాల బాట పట్టాలి
పాక్ మీద ఘోర పరాజయం తర్వాత టీమ్ఇండియా అక్టోబర్ 31న న్యూజిలాండ్‌తో తలపడనుంది. గతం వదిలి బ్యాటింగ్, బౌలింగ్‌లోని లోటుపాట్లను సవరించుకుని భారత జట్టు బరిలోకి దిగాలి. అన్ని రంగాల్లో పటిష్ఠంగా ఉన్న టీమ్ఇండియాకు మామూలుగా అయితే కివీస్ సమస్య కాబోదు. కానీ పాక్ మీద ఓటమితో కివీస్ ఆకలిగొన్న పులిలా ఉంటుంది. దీంతో మైదానంలో సరైన ప్రణాళికలను అమలు చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. లేకపోతే 2007 వన్డే ప్రపంచకప్ మాదిరిగా లీగ్ దశలోనే బయటకు వెళ్లాల్సిన పరిస్థితి రాకమానదు. కివీస్, అఫ్గాన్, స్కాట్లాండ్, నమీబియా మీద గెలిస్తే ఎలాంటి ఆటంకాలు లేకుండా టీమ్ఇండియా సెమీస్‌కు చేరుకుంటుంది. ఒకవేళ కివీస్ మీద ఓడి, మిగతా జట్ల మీద విజయం సాధిస్తే.. అప్పుడు పాకిస్థాన్, న్యూజిలాండ్ ఫలితాల మీద ఆధారపడాల్సి ఉంటుంది. కాబట్టి మిగతా అన్ని మ్యాచులను భారత్ గెలవాలి. అప్పుడే ఎలాంటి సమీకరణాల లెక్క లేకుండా ముందుకెళ్లొచ్చు.
టీ20ల్లో న్యూజిలాండ్‌తో ఇలా..
- భారత్, న్యూజిలాండ్ ఇప్పటివరకు 14 టీ20 మ్యాచుల్లో తలపడ్డాయి. ఇందులో కివీస్ ఎనిమిది, టీమిండియా ఆరు మ్యాచుల్లో విజయం సాధించాయి. టీ20 ప్రపంచకప్ పోటీల్లో అయితే కివీస్‌దే పైచేయి. ఇప్పటివరకు రెండు సార్లు తలపడగా.. రెండింటిలోనూ కివీస్‌నే విజయం వరించింది.
లోపాలు ఎక్కడ..? ఏం చేయాలి?
మొన్నటి వరకు యూఏఈ వేదికగానే ఐపీఎల్ జరిగింది. ఇక్కడి మైదానాలకు టీమ్ఇండియా క్రికెటర్లు బాగానే అలవాటు పడ్డారని ప్రతి ఒక్కరూ భావించారు. వార్మప్ మ్యాచుల్లోనూ దుమ్ములేపేశారు. మాంచి ఫామ్‌లో ఉన్న బ్యాటర్లు.. పరిస్థితులకు తగ్గట్టు బౌలింగ్ చేసే బౌలర్లు భారత జట్టు సొంతమని అంతా అనుకున్నారు. తీరా అసలైన మ్యాచ్‌లో కెప్టెన్ విరాట్ కోహ్లీ, (Virat Kohli) రిషభ్ పంత్ (Rishabh Pant) మినహా మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. రోహిత్ శర్మ (Rohit Sharma) సహా కేఎల్ రాహుల్ (KL Rahul), సూర్యకుమార్ (Surya Kumar Yadav), హార్దిక్ పాండ్య (Hardik Pandya), జడేజా (Ravindra jadeja) ఉసూరుమనిపించారు.
బ్యాటర్ల సంగతి ఇలా ఉంటే.. బౌలింగ్ దళం ప్రదర్శన మరీ తీసికట్టుగా ఉంది. పాక్ మ్యాచ్‌లో ఒక్కటంటే ఒక్క వికెట్టూ పడగొట్టలేకపోయారు. పాక్ ఓపెనర్లు ఎంత కసిగా ఆడారో.. మన బౌలర్లు అంత చప్పగా బౌలింగ్ చేశారు. మన కుర్రాళ్ల బౌలింగ్ తీరు చూస్తుంటే.. వికెట్ తీయాలన్న తాపత్రయం కనిపించలేదని మాజీలు అభిప్రాయపడ్డారు. సీనియర్ బౌలర్లు భువనేశ్వర్ (Bhuvaneswar Kumar), షమీ (Mohammad Shami) ప్రభావం చూపలేకపోయారు. స్లో పిచ్‌లపై తెలివిగా బౌలింగ్ చేయాల్సి ఉంటుంది. పెద్దగా ఫామ్‌లో లేని భువి బదులు బ్యాటింగ్‌కూ ఉపయోగపడే శార్దూల్ ఠాకూర్ (Shardul Thakur)ను తీసుకుంటే బాగుండేదనే వాదనా ఉంది. ఇలాంటి విషయాలను దృష్టిలో పెట్టుకుని జట్టు కూర్పును సిద్ధం చేసుకుంటే కివీస్‌పై ఎంచక్కా గెలిచేయొచ్చు.