టీ20 ప్రపంచకప్‌లో భాగంగా అఫ్గానిస్థాన్-పాకిస్థాన్(AFG vs PAK T20 Match) మధ్య శుక్రవారం(అక్టోబర్ 29) రాత్రి జరిగిన మ్యాచ్‌లో వేలాది మంది అఫ్గాన్ అభిమానులు టికెట్లు లేకుండా స్టేడియానికి తరలిరావడంపై ఆ జట్టు కెప్టెన్ మహ్మద్ నబి(mohammad nabi news) అసహనం వ్యక్తం చేశాడు. మరోసారి ఇలా చేయొద్దని అభిమానులను కోరాడు. మరోవైపు ఈ విషయంపై ఐసీసీ విచారణకు ఆదేశించింది. దీనిపై సమగ్ర దర్యాప్తు జరిపి నివేదిక ఇవ్వాలని ఎమిరేట్స్ క్రికెట్ బోర్డును (ఈసీబీ)(Emirates Cricket Board) కోరింది.
దుబాయ్ వేదికగా గతరాత్రి జరిగిన మ్యాచ్‌ను చూసేందుకు అఫ్గాన్‌కు చెందిన వేలాది మంది అభిమానులు టికెట్లు లేకుండా స్టేడియం వద్దకు తరలివచ్చారు. వారంతా బలవంతంగా లోపలికి ప్రవేశించేందుకు యత్నించారు. దీంతో అప్రమత్తమైన దుబాయ్ పోలీసులు బలగాల్ని మోహరించి అక్కడున్న వారిని చెదరగొట్టారు. స్టేడియంలో ఉన్న ఆటగాళ్లు, ఇతరుల భద్రతకు ఎలాంటి విఘాతం కలగకుండా గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. దీంతో స్టేడియంలోని అన్ని గేట్లు మూసేసి ఎవరినీ అనుమతించలేదు.